- మొదటి విడతగా 5 లక్షల వరకు ఇందిరమ్మ ఇండ్లు
- లబ్ధిదారుల ఎంపికలో పైరవీలకు తావులేదు
- దేశానికి ఆదర్శంగా కొత్త ఆర్వోఆర్ చట్టం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు మొదటి విడతగా 4 నుంచి 5 లక్షల వరకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌శాఖ మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రతి ఏటా జరుగుతుందని, ఇది ఒక నిరంతర ప్రక్రియ అని చెప్పారు. 400 చదరపు అడుగుల్లో ఇల్లు కట్టుకోవాలని, డిజైన్ల విషయంలో ఎలాంటి షరతులు లేవని, ఇళ్ల నిర్మాణానికి సంబంధించి విడతలవారిగా రూ. 5 లక్షల వరకు ప్రభుత్వం సాయం చేస్తుందని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.
24 లక్షల ఇళ్ల నిర్మాణమే టార్గెట్‌గా పెట్టుకున్నామని, మహిళ పేరుతోనే ఇంటిని మంజూరు చేయనున్నట్లు చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లను చూపించి అధికారంలోకి వచ్చి, వాటిని అమలు చేయలేదన్నారు. ధరణిని గత ప్రభుత్వం విదేశీ సంస్థలకు అప్పగించిందని, దీన్ని 2 నెలల క్రితమే విడిపించా మన్నారు.
దేశానికి ఆదర్శంగా ఉండేలా కొత్త ఆర్వోఆర్ చట్టం తీసుకురాబోతున్నట్లు, ఈ చట్టం ద్వారా భూ సమస్యలను పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల రాష్ట్రంలో భూ సమస్యలతో పాటు ఇళ్ల సమస్య కూడా ఎదురైందని పేర్కొన్నారు. అసెంబ్లీలో కొత్త చట్టం వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లోనే జరుగుతుందని, ఇందులో ఎలాంటి పైరవీలు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖీ కార్యక్ర మానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ధరణి బాధ్యతలను ఎన్‌ఐసీకి ఇచ్చామని వెల్లడిం చారు. ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పామని మంత్రి గుర్తుచేశారు. ప్రజలతో ముఖాముఖీ కార్యక్ర మంలో ఎక్కువగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లపైనే దరఖాస్తులు వచ్చాయ న్నారు.
2 నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని తెలిపారు. భూములున్న వారిని గత ప్రభుత్వం ఎంతో ఇబ్బంది పెట్టిందన్నారు. ఆర్వోఆర్ కొత్త చట్టం విషయంలో ప్రతిపక్ష నేతల సలహాలు కూడా తీసుకుంటామన్నారు.
సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తాం..
రూ. 2 లక్షల వరకు ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉందని, అందుకు రూ. 13 వేల కోట్లు అవసరం ఉంటుందని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మిగిలిన రైతులకు కూడా రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. రైతు భరోసా కూడా ఇస్తామని, అప్పులు చేసి ధనిక రాష్ట్రమని చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
రైతులు ఉత్పత్తి చేసిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటామని, రైతులెవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు. రైతుల సమస్యలపై ధర్నాలు, పాదయాత్రలు చేయాల్సిన అవసరం లేదని మంత్రి సూచించారు. సన్న ధాన్యానికి క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తామన్నారు.
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులను జైల్లో పెట్టిన విషయాన్ని మర్చిపోయారా..? అంటూ మంత్రి పొంగులేటి నిలదీశారు. ఇప్పుడు పచ్చ కండువాతో రైతులకు వస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు రైతుబాట, పొలంబాట వంటి యాత్రలు చేయాల్సిన అవసరం లేదని ఆయన హితవు పలికారు.
సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్లకు మంత్రి ఫోన్..
గాంధీభవన్‌లో బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో బుధవారం నిర్వహించిన మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమానికి 300 వరకు దరఖాస్తులు వచ్చాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దాదాపు 150 దరఖాస్తుల వరకు అక్కడి నుంచి అధికారులకు సిఫారసు చేశారు.
ప్రధానంగా భూములు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్ల కోసం వినతులు రాగా, పది మంది కలెక్టర్లకు మంత్రి స్వయంగా ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అంతే కాకుండా ప్రతి దరఖాస్తుదారుడితో మంత్రి మాట్లాడటం, వారి సమస్యలను సావధానంగా విన్నారు. ఈ ముఖాముఖీ కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది.
పింక్ కలర్ ముసుగులో..
లగచర్ల సంఘటనలో అసలు దోషులు త్వరలోనే మీడియా ముందుకు తీసుకుస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. పింక్ కలర్ ముసుగు అడ్డం పెట్టుకుని విధ్వంసం సృష్టిస్తున్నదెవరో ప్రజలకు తెలుసన్నారు. ప్రజాసేవ చేసే అధికారులపై దాడులను ప్రభుత్వం సహించదని హెచ్చరించారు.