మహిళా సాధికారతకు పెద్దపీట
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): ఏడాది వ్యవధిలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేకుండా రూ.20 వేల కోట్ల రుణాలు ఇప్పించి, వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. రాబోయే ఐదేళ్లలో వడ్డీ లేకుండా లక్ష కోట్ల రుణాలను మహిళలకు ఇచ్చి కోటీశ్వరులుగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (అలీప్) 31వ ఆవిర్భావ వేడుకలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి భట్టి హాజరయ్యారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రతి మహిళను మహాలక్ష్మీగా గౌరవిస్తామని, కోటీశ్వరులుగా తయారుచేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అందులో భాగంగానే మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ నడిబొడ్డున శిల్పారామం దగ్గర మహిళా సంఘాల తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి మహిళా శక్తి బజార్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఇలాంటి బజార్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలను రూపొందించామని వెల్లడించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు కావాల్సిన స్థలాన్ని ప్రభుత్వమే ఇవ్వడంతోపాటు పెట్టుబడికి బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పిస్తుందని వివరించారు. అంబానీ, ఆదానీలనే కాకుండా సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటులో మహిళలను భాగస్వామ్యం చేశామని స్పష్టంచేశారు.
సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా రుణాలిప్పించి, ఉత్పత్తున విద్యుత్‌ను గ్రిడ్ ద్వారా కొనుగోలు చేసి.. వారికి ప్రతినెలా బిల్లులను చెల్లింస్తుందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు కోటి మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు.
దశాబ్దంలో ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు
రాబోయే పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఇందులో మహిళలు కూడా భాగస్వాములు కావాలని సూచించారు. గతంలో ఇంటికి ఆర్థిక సమన్వయకర్తలుగా ఉన్న మహిళలు ప్రస్తుతం సమాజ ఆర్థిక సమన్వయకర్తలుగా ఎదుగుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో మహిళల వర్క్ ఫోర్స్ ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో పన్ను కట్టే వారిలో 20 శాతం మహిళలేనని గుర్తుచేశారు. మహిళలకు పారిశ్రామికంగా భాగస్వామ్యం కల్పించేందుకే ఎంఎస్‌ఎంఈ పాలసీలో వారికి ప్రత్యేక స్థానం కల్పించామని స్పష్టంచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ పాలసీ రూపొందించి పారిశ్రామికవే త్తలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ మల్సూర్, సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్, సిడ్బి జీఎం చంద్రమౌళి, అలీప్ ప్రెసిడెంట్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళా పారిశ్రామికవేత్తలకు అవార్డులు అందజేశారు.