అధికారులకు ఇంటర్ బోర్డు సెక్రటరీ ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): ఇంటర్ వార్షిక పరీక్షలకు సమయం దగ్గర పడుతుండటంతో సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య ఆదేశించారు. శనివారం బంజారాహిల్స్‌లోని సేవాలాల్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఇంటర్ బోర్డు కార్యదర్శి కృషాదిత్యతోపాటు వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆర్‌వీ.కర్ణన్, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండల్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కళాశాలల అఫిలియేషన్, సీసీ కెమెరాల ఏర్పాటు, ల్యాబ్ వసతులు, కాలేజీలకు ప్రహరీ గోడల నిర్మాణంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, ఒత్తిడి లేకుండా విద్యార్థులు చదివేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 ద్వారా కౌన్సెలింగ్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో కంట్రోలర్ ఆఫ్ ఎక్జామినేషన్ జయప్రద బాయి, డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.