calender_icon.png 14 November, 2024 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశ్నార్థకంగా ఏనుగుల మనుగడ

13-11-2024 12:55:19 AM

  1. సగటున 77శాతం మేర తగ్గిన ఆఫ్రికా ఏనుగుల సంఖ్య
  2. ప్రమాదంలో అటవీ ఏనుగులు
  3. తాజా నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ, నవంబర్ 12: భూమిపై అతిపెద్ద జంతువులుగా ఆఫ్రికన్ ఏనుగులు గుర్తింపు పొందాయి. అయితే ఈ ఏనుగుల ఉనికి ప్రస్తుతం ప్రమాదంలో పడినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. గడిచిన 50ఏళ్లలో ఆఫ్రికాలోని అనేక ప్రదేశాల్లో ఏనుగుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు పరిశోధనల్లో తేలింది.

సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం పరిశోధకులు ఆఫ్రికా వ్యాప్తంగా 37 దేశాల్లోని 475 ప్రాంతాల్లో ఏనుగుల సంఖ్యపై సర్వే నిర్వహించారు. ఈ క్రమంలోనే 1964-16 మధ్య ఆయా ప్రాంతాల్లో ఏనుగుల సంఖ్యలో విపరీతమైన తగ్గుదలను పరిశోధకులు గుర్తించినట్టు నివేదిక తెలిపింది.

ఆఫ్రికా ఏనుగులను సవన్నా ఏనుగులు, అటవీ ఏనుగులు అని రెండు రకాలుగా విభజించి పరిశోధకులు సర్వే నిర్వహించినట్టు నివేదిక పేర్కొంది. ఈ సర్వే నిర్వహించిన ప్రాంతాల్లో సవన్నా ఏనుగుల సంఖ్య సగటున 70శాతం తగ్గగా అటవీ ఏనుగుల సంఖ్య సగటున 90 శాతం తగ్గిందట. ఇలా మొత్తం ఆఫ్రికన్ ఏనుగుల సంఖ్య సగటున 77 శాతం తగ్గినట్టు నివేదికలో వెల్లడైంది. 

సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణాలు

ఆఫ్రికన్ ఏనుగుల సంఖ్య గణనీయంగా తగ్గడానినికి వేట, వ్యవసాయ విస్తరణే ప్రధాన కారణాలని నివేదిక పేర్కొంది. ఏనుగు దంతాలకు అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీమైన గిరాకీ ఉండటంతో కొందరు వాటిని చంపుతున్నారని వివరించింది. ఆఫ్రికాలోని ఉత్తర సాహెల్, నైజీరియా ప్రాంతాల్లో ఏనుగుల వేట అధికంగా ఉందని నివేదిక తెలిపింది.

దీంతో అటవీ ఏనుగుల సంఖ్య సవన్నా ఏనుగుల సంఖ్యలో మూడింట ఒక వంతు మాత్రమే ఉందని వివరించింది. వ్యవసాయ విస్తరణతో ఏనుగుల ఆవాసాలు నాశనం అవ్వడం కూడా వాటి సంఖ్యపై తీవ్ర ప్రభావం చూపించినట్టు తెలిపింది. ఇది ఇలానే కొనసాగితే అక్కడ వాటి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 

దక్షిణాఫ్రికాలో పరిస్థితి భిన్నం

పరిశోధకులు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఏనుగుల సంఖ్యలో పెరుగుదలను గుర్తించినట్టు నివేదిక తెలిపింది. దక్షిణాఫ్రికా, బోట్సానా, జింబాబ్వే, నమీబియాల్లో వంటి ప్రాంతాల్లో ఏనుగుల సంతతి వృద్ధి చెందినట్టు పేర్కొంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో ఏనుగుల సంఖ్య 42 శాతం పెరిగినట్టు వివరించింది. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాలు చేపట్టిన రక్షణ చర్యల వల్లే వాటి సంఖ్య పెరిగిందని తెలిపింది. అంతేకాకుండా ఆఫ్రికా వ్యాప్తంగా సుమారు 4,15,000 నుంచి 5,40,000 ఏనుగులు ఉండొచ్చని నివేదిక అంచనా వేసింది.