కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, జనవరి 18 (విజయ క్రాంతి) : సంక్షేమ పథకాల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. రాష్ర్ట ప్రభుత్వం జనవరి 26 నుండి ప్రారంభించనున్న నాలుగు సంక్షేమ పథకాలు అరులైన ప్రతి ఒక్కరికి అందేవిధంగా అధికారులు సర్వే చేయాలని సూచించారు.
శనివారం ఉదయం పానగల్ మండలం, చింతకుంట గ్రామం, వీపనగండ్ల మండలం, గోవర్ధన గిరి గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో సర్వే జరుగుచున్న తీరును పరిశీలించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల తుది జాబితా వివరాలు వెల్లడించేందుకు, అభ్యంతరాలు స్వీకరించేందుకు జనవరి 21 నుండి 24 వరకు నిర్వహించే గ్రామ సభలు ఏ రోజు ఏ గ్రామంలో నిర్వహిస్తున్నారో ముందుగానే అన్ని గ్రామాల్లో చాటింపు వేయించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం వీపనగండ్ల మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సర్వే పై ఆరా తీశారు. వీపనగండ్ల మండల ప్రత్యేక అధికారి లక్ష్మప్ప, తహసిల్దార్ వరలక్ష్మి, పానగల్ తహసిల్దార్ సత్యనారాయణ రెడ్డి, ఎంపీడీఓ లు, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు కలక్టర్ వెంట ఉన్నారు.