- రెండోరోజు సాఫీగా కులగణన
- నేటి నుంచి బీసీ డెడికేటెడ్ కమిషన్ విచారణ
- క్షేత్రస్థాయిలో సర్వేలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు
- సర్వేపై అనుమానాలు పెట్టుకోవద్దు:మంత్రి పొన్నం
హైదరాబాద్/హుస్నాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే సాఫీగా సాగుతోంది. మొదటిరోజు సమాచారం నింపేందుకు ఎక్కువ సమ యం తీసుకున్న సిబ్బంది.. రెండో రోజు స్పీడు ను పెంచారు.
మొదటిరోజు ఎదురైన ఇబ్బందులను సరిచేసుకొని ఆదివారం కులగణనలో ఎన్యుమరేటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు కూడా తమ వివరాలను చెప్పేందుకు స్వచ్ఛంగా ముందుకొస్తున్నారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలను చైతన్యపరుస్తూ ఎన్యుమరేటర్లకు సహకరించేలా కృషి చేస్తున్నారు.
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎన్యుమరేటర్లకు వచ్చిన సమస్యలను నివృత్తి చేస్తున్నారు. మొదటి రెండు రోజుల పాటు నింపిన ఫామ్స్ ఎన్యుమరేటర్ల వద్దే ఉన్నాయి. సోమవారం నుంచి ఏ రోజుకు ఆ రోజు నింపిన ఫామ్స్ సూపర్‌వైజర్లు సేకరించనున్నారు.
సేకరించిన డేటాను నిక్షిప్తం చేసే అంశంపై అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సర్వే పత్రాలను భద్రపర్చడానికి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయాలని జోనల్ కమిషనర్లను ప్రభు త్వం ఆదేశించింది.
ఎవరెంతో వారికంత వాటా దక్కాలె: మంత్రి పొన్నం
ఎవరెంతో వారికంత వాటా దక్కాలనే విధానంతోనే తమ ప్రభుత్వం కులగణన చేపడుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎన్యుమరేటర్లతో కలిసి వివరాలను సేకరించారు. సమాజంలో ఉన్న అసమానతలను పోగొట్టేందుకే కులగణన చేస్తున్నామన్నారు.
దీంతో కులాల అభివ ద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. ఇంటికి వచ్చిన ఎన్యుమరేటర్లకు ఆస్తుల వివరాలు కూడా చెప్పాలన్నారు. సర్వే పై ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని, ఆ సమాచారాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్ కూడా కుటుంబ సర్వేలో వివరాలు నమోదు చేసుకున్నట్టు చెప్పారు. కాగా సంగారెడ్డి జిల్లా ఆంధోల్‌లో కలెక్టర్ పర్యటించి ఇంటింటి సర్వేను పరిశీలించారు.
గ్రేటర్‌లో 69 వేల కుటుంబాల సర్వే..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమన్వయకర్తగా హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, గ్రేటర్‌లోని 6 జోన్లకు ఒక్కో జోన్‌కు ఒక్కో ఐఏఎస్ అధికారిని సూపర్‌వైజర్‌గా ప్రభుత్వం నియమించింది. రెండో రోజు చేపట్టిన సమగ్ర సర్వేలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 69, 624 కుటుంబాలను అధికారులు సర్వే చేశారు.
నేడు, రేపు డెడికేటెడ్ కమిషన్ విచారణ..
సోమవారం నుంచి బీసీ డెడికేటెడ్ కమిషన్ కూడా రంగంలోకి దిగనున్న నేపథ్యంలో ఇక కులగణన సర్వే మరింత ఊపందుకోనుంది. సోమవారం, మంగళవారం మాసబ్ ట్యాంకులోని సంజీవయ్య భవన్‌లో విచారణ చేపట్టనున్నారు. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు విచారణ నిర్వహించిన తర్వాత అన్ని జిల్లాల్లో నిర్వహించనున్నారు.