భారీ నక్షత్రం ఫొటోను విడుదల చేసిన శాస్త్రవేత్తలు
న్యూఢిల్లీ, నవంబర్ 22: సూర్యుడి కంటే 2వేల రెట్లు పెద్దది, 1.60లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న డబ్ల్యూఓహెచ్ జీ64 అనే నక్షత్రానికి సంబంధించిన తొలి వివరణాత్మక ఫొటోను శాస్త్రవేత్తలు తీశారు. శాస్త్రవేత్తలు తాజాగా విడుదల చేసిన ఫొటోలో డబ్ల్యూఓహెచ్ జీ64 నక్షత్రాన్ని గుడ్డు ఆకారపు పొర కప్పి ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ భారీ నక్షత్రం సూపర్నోవా(విస్పోటనం)కు చేరుకునే ముందు తనలోని వాయువులను, దూళిని విడుదల చేస్తున్నట్టు పరిశోధకులు తీసిన చిత్రం ద్వారా అర్థమవుతోంది.
ప్రొఫెసర్ కీచి ఒహ్నాకా నేతృత్వంలోని చిలీలోని ఆండ్రెస్ బెల్లో నేషనల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ నక్షత్రంపై పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా పరిశోధకులు గ్రహించిన వివరాలను మునుపటి డేటాతో పోల్చినప్పుడు గత దశాబ్దకాలంగా నక్షత్ర పరిమాణం తగ్గుతున్నట్టు తెలుసుకున్నారు.