calender_icon.png 15 March, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెగల సూరీడు!

15-03-2025 12:37:21 AM

  1. రెండోవారంలోనే 40డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు 
  2. గతేడాది నాలుగో వారంలో 40 డిగ్రీలు 
  3. రాబోయే మూడు రోజుల్లో 2 నుంచి 4డిగ్రీలు పెరిగే అవకాశం 
  4. ఉత్తర తెలంగాణకు ఎల్లో అలర్ట్ 
  5. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వడగాలులు!

హైదరాబాద్, మార్చి 14 (విజయ క్రాంతి): రాష్ట్రంలో ఎండలు కాకపుట్టిస్తు న్నాయి. మార్చిలోనే మాడ పగులగొడుతు న్నాయి. శుక్రవారం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోద య్యాయి. ఆదిలాబాద్‌లో 40.3 డిగ్రీలు  నమోదుకాగా.. నిజామాబాద్‌లో 40.1 డిగ్రీలు రికార్డు కావడం గమనార్హం.

గతేడాది మార్చి నాలుగోవారంలో కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు నమోదుకాగా ఈసారి రెండోవా రంలోనే ఆ మార్క్ దాటింది. రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రంలో కనీసం 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా  నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతా వరణశాఖ అధికారి ధర్మరాజు ‘విజయ క్రాంతి’కి తెలిపారు.

ఈ లెక్కన గతేడాది కంటే ఈసారి ఎండలు దంచికొట్టే అవకాశా లు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ లోని ఏడు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వడగాలులు వీచే అవ కాశం ఉందని వెల్లడించారు.

నేడు ఎల్లో అలర్ట్ జారీ.. 

ఎండల తీవ్రత నేపథ్యంలో ఉత్తర తెలం గాణలోని పలు జిల్లాల్లో ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజా మాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలు ఎల్లో అలర్ట్ జారీ చేసిన జాబితాలో ఉన్నాయి.

ఈ జిల్లాలో వడగాల్పుల పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. ఇదిలాఉండగా హైదరాబాద్ సహా సెంట్రల్ తెలంగాణలో సగటును 39 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు ఐఎండీ పేర్కొంది. ఇక్కడ కనిష్ఠ టెంపరేచర్ 23 డిగ్రీలు నమోదువుతున్నట్టు వివరించింది.

ఆ జిల్లాల్లో 44 డిగ్రీలు? 

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో రాబోయే రెండు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ క్రమంలో ఆ జిల్లాలో 15, 16 తేదీల్లో 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదుకావొచ్చని చెప్పింది. ఒకవేళ 44 డిగ్రీలు నమోదైతే.. ఆ జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేస్తుందని వాతావరణశాఖ వర్గాలు వెల్లడించాయి.