నేడు ప్రపంచ వృద్ధుల దినోత్సవం :
యవ్వనదశలో తమ శక్తి యుక్తులన్నింటినీ పిల్లల ఎదుగు దలకే వెచ్చించిన తలిదండ్రులు అవసాన దశలో బుక్కెడు బువ్వకు, జానెడు నీడకు తడుముకోవాల్సిన దుస్థితిలో చిక్కుకు పోవడం బాధాకరం.
వృద్ధాప్యం అనివార్యమైన తప్పించుకోలేని దశ. ఈ వాస్తవాన్ని విస్మరించి, అనేక కుటుంబాలు, సమాజం వృద్ధులను భారం గా భావిస్తూ అనేక రకాలుగా వేధిస్తున్నారు. వృద్ధులపై వేధింపులు ప్రపంచవ్యాప్త సమస్య. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధుల అనాదరణ, వేధింపులు వారిపై జరుగుతున్న పలురకాల హింస జటిల సామాజిక సమస్యగా పరిణమించిందని సామాజిక వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఐక్యరాజ్య సమితి వయోవృద్ధుల దినోత్సవాన్ని ఏటా అక్టోబర్ 1న నిర్వహిస్తుంది. 1984లో వియన్నాలో మొట్టమొదటి వయోవృద్ధుల సదస్సు జరిగింది. సీనియర్ సిటిజన్ అనే పదం ఇదే సదస్సులో మొదటి సారిగా వాడడం జరిగింది. వృద్ధులపై వేధింపులు ప్రతి సమాజంలో సామాజిక లక్షణ మైంది. దానిని గుర్తించక పోవటం విచారకరం.
వృద్ధులను ప్రస్తుత సమాజం అను త్పాదక వర్గంగా, భారంగా భావిస్తూ అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సామాజిక,ఆర్థిక,ఆరోగ్య నిర్లక్ష్యం వృద్ధులకు శాపం గా పరిణమించింది.వృద్ధులకు ఆహారం, ఔషధాలు, భద్రత లేక పోవడం. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం వల్ల వృద్ధులు అనాధలుగా మారుతున్నారు. ఒకప్పుడు జనాభా విస్పోటనం ప్రపంచాన్ని భయపెట్టింది.
ప్రస్తుతం ప్రపంచ ప్రభుత్వాలను సిల్వర్ సునామీ ఆందోళనలోకి నెడుతున్నది. ఉత్పాదనలో కీలకమైన యువతరం సంఖ్య తగ్గి,వయోవృద్ధుల సంఖ్య పెరుగుతున్నది. ఈ పరిమాణాన్ని ఆర్థిక వేత్తలు ‘సిల్వర్ సునామీ’ గా నామకరణం చేశారు. ఈ సునామీని తట్టుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు సమయాత్త మవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వయోధికుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది.
2022 ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ప్రపంచంలో 77.1 కోట్లమంది 65 ఏళ్ళు పైబడిన వారున్నారు. అంటే మొత్తం జనాభాలో వీరు దాదాపు 10 శాతం.
జనాభా లెక్కల ప్రకారం భారత దేశంలో వృద్ధుల జనాభా 1951- 1991 సంవత్సరాల మధ్య 20 మిలియన్లు ఉండగా 1991- - 2001మధ్య 57 మిలియన్లకు పెరిగింది.75 శాతం మంది వృద్ధులు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.81 శాతం వృద్దులు ఆధునిక సమాజంలో పెరుగుతున్న ఒత్తిడి, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
హెల్ప్ ఏజ్ ఇండియా సర్వే ప్రకారం 47 శాతం వృద్ధు లు తమ ఆర్థిక ఆరోగ్య అవసరాల కోసం సంతానం మీద ఆధారపడి జీవిస్తున్నారు. 37 శాతం ప్రభుత్వం అందించే పెన్షన్స్ మీద ఆధారపడి జీవితాలను నెట్టుకొస్తున్నారు. ప్రతి ఒక్కరు మలి సంధ్యలో అనందంగా, ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉత్సాహంగా జీవనం సాగేందుకు తగిన పరిస్థితుల్ని దేశంలో కల్పించడం సామాజిక అవసరం.
నేదునూరి కనకయ్య