calender_icon.png 19 March, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరి కృషికి ‘కుంభ్’ విజయమే ఉదాహరణ

19-03-2025 12:36:43 AM

కుంభమేళా భారతదేశ ఆధ్యాత్మికతను ప్రపంచానికి చూపింది..

మన సామర్థ్యంపై నమ్మకం లేని వారికి ఈ విజయం సమాధానమిచ్చింది..

66 కోట్ల పైచిలుకు మంది కుంభమేళాలో పుణ్యస్నానాలు చేశారన్న ప్రధాని మోదీ.. 

అభ్యంతరం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ..

న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్‌లో విజయవంతంగా నిర్వహించిన మహాకుంభమేళాపై ప్రధాని మోదీ మరోసారి స్పందించారు. అందరూ కలిసి కట్టుగా పని చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఈ మేళా చూపెట్టిందని పేర్కొన్నారు. ప్రధాని మంగళవారం పార్లమెంట్‌లో మాట్లాడారు. ‘భారత్‌లో పెరుగుతున్న స్ఫూర్తిని కుంభమేళా ప్రతిబింబించింది. కుంభమేళా విజయవంతం కావడం వెనుక ఎంతో మంది కృషి దాగి ఉంది. ఆ కర్మ యోగులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నా.

కుంభమేళా విజయవంతంతో మన శక్తి ఏంటనేది మొత్తం ప్రపంచం చూసింది. ఎవరైతే మన శక్తి, సామర్థ్యాల మీద అనుమానం వ్యక్తం చేశారో వారికి ఈ మేళా తగిన సమాధానం కూడా ఇచ్చింది’ అని మోదీ పేర్కొన్నారు. ఆ తర్వాత విపక్ష సభ్యులు తీవ్ర నిరసనలు చేపట్టడంతో సభ వాయిదా పడింది.  కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య విషయంలో కూడా విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 144 ఏండ్లకోసారి వచ్చే మహాకుంభమేళాలో 66 కోట్లకు పైచిలుకు మంది పుణ్యస్నానాలు ఆచరించారు. 

భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత

భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత అని ప్రధాని మోదీ అన్నారు. ‘ఈ రోజు ప్రపంచంలో అనేక చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. కుంభమేళా మన ఐకమత్యాన్ని ప్రదర్శించింది. ఐకమత్యమే మన బలం. భిన్నత్వంలో ఏకత్వం అని మనం ప్రతి సారి చెప్పిన విధంగానే కుంభమేళాలో జరిగింది’ అని అన్నారు. 

ప్రధాని అలా చేసుండాల్సింది: రాహుల్

కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారికి ప్రధాని మోదీ నివాళులు అర్పించాల్సిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘కుంభమేళాకు వెళ్లిన యువతకు  ప్రధాని నుంచి ఉపాధి అవకాశాలు కావాలి. ప్రధాని ఉపాధి అవకాశాలపై మాట్లాడాలి’ అని పేర్కొన్నారు.