* టీఎన్జీవో నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): ఫిబ్రవరి మొదటివారంలో ఉద్యో గులతో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని, ఉద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను ఒక్కొక్కటిగా మంజూరు చేస్తున్నామని తెలిపారు.
సచివాలయంలో టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం హుస్సేని ముజీబ్ నేతృత్వంలో అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ అధ్యక్షుడు కట్కూరి శ్రీకాంత్‌తోపాటు ఇతర సంఘాల నేతలు శనివారం సచివాలయంలో భట్టి విక్రమార్కను కలిశారు.
ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని నేతలు కోరారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలతో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను ప్రాధాన్యక్రమంలో పరిష్కరించాలని కోరారు.
డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ఖాదర్, ముక్రం, పీ శ్రీనివాస్, మహేందర్, ఖాజా, వహీద్, నర్సింగరావు, రాజు, లక్ష్మీనారాయణ ఉన్నారు.