calender_icon.png 13 January, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యథార్థ, యథార్థ జీవన పోరాటాలు

23-12-2024 12:00:00 AM

మహాకవి దాశరథి కృష్ణమాచార్య కథలు చదవడమంటే అద్భుతమైన కవితాత్మక యధార్థ జీవన చిత్రాలను దర్శించుకున్నట్లే. ఆయన కవితల వలె వచనాలు కూడా సూటిగా పాఠకుల గుండె గోడలను స్పృశిస్తాయి. ప్రత్యేకించి ఆయా కథల్లో మహాకవి ప్రకృతి వర్ణన అనితర సాధ్యం. ‘తెలంగాణ సాహిత్య అకాడమి’ దాశరథి శతజయంతి సంవత్సరం (1925 సందర్భంగా ఇటీవల వెలువరించిన ‘నిప్పుపూలు’ కథల సంపుటి సామాజిక స్పృహ, మానవీయ కోణాలు, నైతిక విలువలు వంటివాటిని అమితంగా ఇష్టపడే పాఠకులు తప్పక చదవాలి.

ఒకవేళ చదవ లేకపోతే అమూల్యమైన జీవన పోరాటాల దృశ్యాల యధార్థ, వ్యధార్థ ఉద్వేగాలను తెలుసుకోలేని వాళ్లవుతారు. అపురూపమైన మొత్తం 13 దాశరథి కథలతో రూపు దిద్దుకున్న ఈ పుస్తకం ముఖచిత్రంపై మహాకవి కళాత్మక చిత్రం సింప్లీ సూపర్బ్. కళాకారుడు చేర్యాల రవిశంకర్ అభినందనీయుడు. ఇందులోని ‘నిప్పుపూలు’ నుంచి ‘స్వాతి చినుకులు’ వరకు ప్రతీ కథా ఒక ఆణిముత్యమే. చదవడం మొదలుపెడితే ఆపబుద్ధి కాదు.

చాలావరకు కథల ఇతివృత్తాలు ఆనాటి నైజాం రాజ్యంలోని వివిధ వర్గాల ప్రజలు దయ లేని పాలకుల వల్ల ఎదుర్కొన్న అన్యాయాలు, అకృత్యాల ప్రాతిపదికగానే రూపొందాయి. ఆయా కథల్లో మహాకవి దాశరథి వ్యక్తీకరణలు ఒక్కచోట చదివితే వాటిలోని సాంద్రతను అర్థం చేసుకోవచ్చు. 

‘బంగళా కిటికీలలోంచి ఎర్రటి సాయంత్రం కనపడుతున్నది’,‘మోదుగు మొగ్గల్లో చల్లారని నిప్పు’, ‘పడమటి ఆకాశం గౌరి కొప్పులో నవ్వింది’, ‘కాలం చేతిలోంచి జారిపోయింది. పైగా ఎదురు తిరిగింది. ఎన్నడూ లేంది హిందువులు మారారు.

అంతా అల్లా మాయ’ (నిప్పుపూలు), ‘సూర్యగోళాన్ని తనవైపు లాక్కుంటున్నాడు’, ‘భవిష్యత్తు దొంగచాటుగా తొంగితొంగి చూస్తున్నది నైజామును మ్రింగాలని’ (తెలంగాణ అమరవీరుని రక్తాంజలి), ‘వెన్నెల పుచ్చపువ్వులా విచ్చుకున్నది’, ‘ఎండ వచ్చింది, కన్ను విచ్చింది’, ‘మాలిని మాను కూలినట్టు కూలిపోయింది. ఇల్లంతా బావురుమంది’ (వెన్నెల్లో చీకటి), ‘కళ్లలోంచి గుత్తులు గుత్తులుగా ముత్యాలు రాలాయి’

‘అతని కళ్లలో సముద్రాలు తొణికిస లాడాయి’, ‘చిచ్చుబుడ్డిలా పూలు పేల్చి చల్లారి పోతోంది రాత్రి’ (మారువేషం) .. ఇలా రాస్తూ పోతే ఎన్నెన్నో కవితాత్మక ప్రయోగాలు. ‘కుంకుమ నోచుకోని విధవ స్త్రీలలా వున్నై మోదుగు పూలు’, ‘సారంగపాణి ఇంటినిండా రవణమ్మ కన్నీళ్లే కనపడ్డాయ్’ అంటారాయన ‘పూచిన మోదుగులు’ కథలో. అన్ని కథలూ 1949 నుంచి 1978 మధ్యకాలంలో రాసినవే. 

(నిప్పుపూలు, దాశరథి కథల సంపుటి, పేజీలు: 112, వెల: రూ.90-/ సంపాదకులు: డా. నామోజు బాలాచారి, ప్రతులకు: తెలంగాణ సాహిత్య అకాడమి, కళాభవన్, రవీంద్రభారతి, సైఫాబాద్, హైదరాబాద్ ఫోన్: 040 29703142)

- ‘అక్షర’ డెస్క్