07-02-2025 05:57:43 PM
పెద్దపల్లి నియోజకవర్గంలో మాదిగల సంబరాలు..
సీఎంకు మంత్రి వర్గానికి, పెద్దపల్లి ఎమ్మెల్యేకు కృతజ్ఞత ర్యాలీ...
పెద్దపల్లి (విజయకాంతి): అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తెలంగాణలో ఎస్సీల వర్గీకరణ అమలుకు ఏకసభ్య కమిషన్ ను నియమించి, వర్గీకరణకు సానుకూల నివేదికను సీఎం శ్రీ రేవంత్ రెడ్డి తెప్పించుకొని ఈనెల 4న జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఆమోదం పొందిన సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం రోజున సంబరాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రివర్గానికి, స్థానిక పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ పెద్దపల్లి నియోజకవర్గంలోని ఎస్సీ మాదిగ ఉప కులాలు, పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాదిగ ఉపకులాల ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. పెద్దపల్లి స్థానిక జెండా చౌరస్తా నుండి కమాన్ మీదుగా బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వరకు డప్పు చప్పులతో ర్యాలీ కొనసాగింది.
అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మాదిగల ఉద్యమ నేత పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ, సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వర్గీకరణకు సంబంధించి వెంటనే గెజిట్ పబ్లిష్ చేయాలని మాదిగ సంఘాల నాయకులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాదిగ ఉప కులాలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ నుండి మరో రెండు శాతం పెంచాలని కోరారు. వర్గీకరణ ఉద్యమంలో అమరులైన ఉద్యమకారులకు నివాళులు అర్పించారు. పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, మాజీ జెడ్పిటిసి లంక సదయ్య, సుల్తానాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుక సతీష్, ఎలిగేడు మండల నాయకులు కొండయ్య, జూలపల్లి మండల నాయకులు రామస్వామిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నాయకులు పాల రాజేశం, బొంకూరి నరసయ్య, పెరిక రాజేశం, కుక్క మల్లేష్, సిరిసిల్ల శంకర్, అరికెళ్ల లచ్చయ్య, మారేపల్లి రాజు, కుమ్మరి ముఖేష్, వడ్డేపల్లి బాలయ్య, కళాకారులు, మహిళా డప్పు బృందాలు, వందలాది మంది మాదిగ సోదరులు పాల్గొన్నారు.