calender_icon.png 27 October, 2024 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడిపండు రహస్యం కథ

18-05-2024 12:00:00 AM

‘అమ్మా... అమ్మా...’ హాలులోంచి బన్నీ పిలవటంతో ‘ఏంటి బన్నీ?’ అని అడిగింది సంధ్య

‘జానీ నాకొక పండు ఇచ్చాడు... తిననా?’

‘అలాగే...! కడుక్కొని తిను’ వంటింట్లో ఉన్న సింక్‌లో నీళ్లతో కడుక్కొని తల్లి దగ్గరకు వచ్చి ‘అమ్మా... చూడు ఈ పండు ఎంత బాగుందో’ అన్నాడు.

కూరగాయలు తరుక్కుంటూ తలపైకెత్తిన సంధ్య ‘ఛీ... ఛీ... మేడి పండా? తినకు’ అంది.

‘ఏం? ఇంత బాగుంది కదా... తినొద్దు అంటావేం?’

‘అది పైకే అందంగా కనిపిస్తుంది. లోపల అంతా పురుగులే బన్నీ’

‘ఏం కాదు’ అన్నాడు తల అడ్డంగా ఊపుతూ..  నోట్టో పెట్టుకోబోతున్న మేడి పండును లాగేసుకుని తీసి చూపించింది. అన్నీ పురుగులే.. కళ్లు పెద్దవి చేసుకొని మరీ చూశాడు బన్నీ.

‘ఇప్పడర్థమయ్యిందా? పైకి కొందరు ఇలా మంచిగానే కనిపిస్తతారు. కానీ వాళ్లు మంచి వాళ్లు కాదు. మన పక్కింటి జానీ అలాంటివాడు. గొప్ప గొప్ప కబుర్లు చెబుతాడు. కానీ వట్టి పిరికివాడు, చెడ్డవాడు. అందుకే అతనితో స్నేహం చెయ్యవద్దని చెబుతాను. నువ్వూ, మీ అన్నయ్య మాట వినరు కదా’

‘నిజమా...’ బన్నీ ఆశ్యర్యపోతూ అన్నాడు.

‘అవును బన్నీ... చెడ్డవారు పైకి మంచిగా కనిపిస్తారు. కానీ వారిలో ఉన్న చెడుగుణాలు ఎప్పుడూ ఎదుటి వాళ్లకి హాని చేస్తాయి. అందుకే ఎప్పుడూ మంచి వాళ్లతోనే స్నేహం చెయ్యాలి. కొందరు మేడి పండులా నిగనిగలాడుతూ పైకి బాగా కనిపిస్తారు. కానీ లోపల పురుగులు ఉంటే తినలేని వారన్న మాట..’

‘ఇన్నాళ్లూ నాకు తెలియలేదమ్మా’

లోపలికి వెళ్లి వాళ్ల అన్నయ్య పుస్తకం తీసుకువచ్చి ‘వేమన కవి దీని గురించి ఎంత మంచి పద్యం రాసారో చూడు...

మేడిపండు చూడ మేలిమై యుండు

పొట్టవిప్పి చూడ పురుగులుండు

పిరిక వాని మదిని బింకమీలాగురా

విశ్వధాభిరామ వినురవేమ’ అని చదివి వినిపించింది.

‘ఇప్పుడు నాకు అర్థమయ్యింది కదా ఎవరితో స్నేహం చెయ్యాలో... నేనూ అన్నయ్య ఇక నుంచీ జానీతో స్నేహం చెయ్యం సరేనా’

‘నా బన్నీ బంగారం’ అని దగ్గరకు తీసుకుని మురుపెంగా తల్లి సంధ్య బన్నీని ముద్దు పెట్టుకుంది.

నీతి: మంచి వాళ్లతో స్నేహం చేయాలి, చెడ్డవారికి దూరంగా ఉండాలి.

- యలమర్తి అనూరాధ, 92472 60206