calender_icon.png 17 October, 2024 | 5:57 AM

సద్దుమణిగిన ఐఏఎస్‌ల కథ!

17-10-2024 03:44:18 AM

సొంత రాష్ట్రాలకు వెళ్లాలని డీవోపీటీ ఆదేశాలు

ఇక్కడి నుంచి అటు.. అక్కడి నుంచి ఇటు

హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎస్‌తో ఐఏఎస్‌ల భేటీ  

తెలంగాణ నుంచి వాణీప్రసాద్, కరుణ, రొనాల్డ్‌రాస్, ఆమ్రపాలీ రిలీవ్

తెలంగాణ సీఎస్‌కు సృజన, హరికిరణ్, శివశంకర్ రిపోర్టు

సీనియర్ ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు అప్పగింత 

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి, ఎన్.శ్రీధర్‌కు  పర్యాటక శాఖ, ఇంధన శాఖకు సందీప్ కుమార్ సుల్తానియా

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఐఏఎస్ అధికారుల బదిలీల వ్యవహారం ఎట్టకేలకు సద్దుమణిగింది. ఈనెల 16 తేదీ లోపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించిన ఐఏఎస్‌లు వారి వారి సొంత రాష్ట్రాలకు వెళ్లాలని కేంద్రం (డీవోపీటీ) ఆదేశాలు జారీచేసింది.

ఇందులో తెలంగాణ నుంచి నలుగురు ఐఏఎస్‌లు వాణీప్రసాద్, కరుణ, రొనాల్డ్‌రోస్, అమ్రపాలి రిలీవ్ అయి ఏపీలో రిపోర్టు చేయాలని.. అలాగే ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ క్యాడర్‌కు చెందిన ముగ్గురు ఐఏఎస్‌లు సృజన, హరికిరణ్, శివశంకర్ అక్కడ రిలీవ్ అయి తెలంగాణలో ఈనెల 16 లోగా రిపోర్టు చేయాలని డీవోపీటీ ఆదేశాలు జారీచేసింది. 

హైకోర్టు ఆదేశాలతో..

అయితే దీనిపై తెలంగాణకు చెందిన ఐఏఎస్‌లు, ఏపీకి చెందిన ఐఏఎస్‌లు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)కు అప్పీలు చేసుకున్నారు. అక్కడకూడా వారికి చుక్కెదురయ్యింది. దీనితో ఇరు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ఐఏఎస్ అధికారులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు ఐఏఎస్‌లకు చురకలు అంటిస్తూ ముందుగా రిలీవ్ అయి వారికి కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలంటూ సూచించింది.

హైకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో చివరికి సచివాలయంలో సీఎస్ శాంతికుమారితో ఐఏఎస్ అధికారులు వాణీప్రసాద్, కరుణ, రొనాల్డ్‌రోస్, అమ్రపాలి కాటలు భేటీ అయి చాలా సేపు చర్చించారు. ఇంకా ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం వీరిని రిలీవ్ చేయడంతో రిపోర్టు చేయడానికి వారు ఏపీకి వెళ్లారు.

ఏపీ నుంచి తెలంగాణకు..

ఇదిలా ఉండగా.. హైకోర్టు నుంచి సానుకూలమైన ఆదేశాలు రాకపోవడంతో తెలంగాణకు కేటాయించిన ఏపీలోని ఐఏఎస్ అధికారులు సృజన, హరికిరణ్, శివశంకర్‌లు బుధవారం సాయంత్రం ఏపీ ప్రభుత్వం నుంచి రిలీవ్ అయ్యారు. సాయంత్రం హైదరాబాద్‌లో సచివాలయానికి చేరుకున్న ముగ్గురు ఐఏఎస్‌లు సీఎస్ శాంతికుమారితో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. వారికి ఇంకా పోస్టింగులు ఇవ్వలేదు.

సీనియర్ ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు..

వాణీప్రసాద్, కరుణ, రొనాల్డ్ రోస్, అమ్రపాలిలను రిలీవ్ చేయడంతో వారు బాధ్యతలు నిర్వర్తించిన ఆయా శాఖలకు సంబంధించి పూర్తి అదనపు బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారులకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులో పేర్కొన్న ప్రకారం...

* ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్న ఎన్.శ్రీధర్‌కు పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా, ఆర్కియాలజీ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

* ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్న సందీప్‌కుమార్ సుల్తానియాకు ఇంధన శాఖ సెక్రెటరీగా, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పజెప్పారు.

* వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సెక్రెటరీ క్రిస్టినా జెడ్ ఛోంగ్తుకు ఆయుష్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు  ఇచ్చారు.

* ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ డాక్టర్ టి.కె.శ్రీదేవికి  మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శింగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

* రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. 

* ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టరగా ఉన్న ఆర్.వి.కర్ణన్‌కు ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.