calender_icon.png 9 February, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలువ మల్లయ్య కథల తొవ్వ

27-01-2025 12:00:00 AM

మన తెలంగాణ గర్వించదగ్గ నిక్కమైన, అచ్చమైన రచయిత కాలువ మల్లయ్య. ఉప్పెనలా వచ్చిన కష్టాలు జీవితాన్ని తొవ్వ తప్పేలా చూసినా ఆయన అడుగు తడబడ లేదు. ప్రాణం వంటి కథను దారి మళ్లించలేదు. ప్రముఖ కవి, రచయిత సందినేని రవీందర్ పొందికైన మాటల్లోనే చదవండి, మన కథల మల్లయ్య ముచ్చట్లు.

తెలంగాణ కథకు నిలువెత్తు ప్రతిరూపం. మన ప్రాంత కథా, నవలా రచయితలలో ఆయన అగ్రేసరుడు. పుట్టి పెరిగిన ప్రాంతంలోని గ్రామీణుల జీవితాలను అక్షరబద్ధం చేసి వారి కష్టాలను, కన్నీళ్ళను ప్రపంచానికి తెలియజేశారు. గ్రామీణుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆప్యాయతలు, అనురాగాలను ఎంతో నేర్పుతో చిత్రించారు. ఇంగ్లీషు నాటక రచయిత షేక్ స్పియర్ వలె కాలువ మల్లయ్య సామాన్య ప్రజల జీవితాలను రచనలుగా మలువడం ఆయన ప్రత్యేకతగా చెప్పాలి.

డా. కాలువ మల్లయ్య కరీంనగర్ జిల్లా జూలపల్లి మండలంలోని తెలుకుంట గ్రామంలో కాలువ ఓదెలు పోచమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి ఓదెలు రైతు కుటుంబానికి చెందిన వారు. వ్యవసాయాన్నే ప్రధాన వృత్తిగా స్వీకరించారు. చదువు, జ్ఞానం ఉన్నవారు కనుక ఆయన గ్రామీణులలో పెద్దరికాన్ని సంతరించుకున్నారు.

మంచికీర్తిని సంపాదించుకున్నారు. అదే ఊరికి చెందిన వెంకటయ్య పంతులుతో కలిసి, భజన మండలిని స్థాపించారు. భజనలు, కీర్తనలద్వారా ప్రజలలో చైతన్యాన్ని రగిల్చారు. ప్రత్యేకించి గొల్ల, కురుమల అభివృద్ధి, వారి చదువుసంధ్యలకై ఎంతో కృషిచేశారు.

ఆనాటి సమాజంలో అక్షరజ్ఞానం కలిగిన ఓదెలు తన ఏకైక కుమారుడు కాలువ మల్లయ్యను బీయస్‌సీ వరకు చదివించారు. తన  ఉన్నతికై ఎంతో తోడ్పాటు నందించాడు. అనంతరం మల్లయ్య కలకత్తా యూ నివర్సిటీ నుంచి ఎంఎస్‌సీ (కెమిస్ట్రీ) చదివారు. 

గురువు మలయశ్రీ ప్రభావం

బీఎస్‌సీ చదివే రోజుల్లో కరీంనగర్‌లో జరిగే బోయినవల్లి వెంకట రామారావు సాహితీ సభలకు హాజరవుతుండడంతో ఆయనలో సాహిత్యాభిరుచి ఏర్పడింది. అంతకు ముందే శతాధిక గ్రంథ రచయిత మలయశ్రీ 9వ తరగతిలో గురువు. ఆయనతోపాటు కరీంనగర్‌లోని సాహిత్య వాతావరణం, యస్.కె. పిళ్లు రచనలు వంటి ప్రభావాల వల్ల మల్లయ్య ఉత్తమ రచయితగా, కవిగా పేరొందారు.

ఆయన మొదట కవితా సౌరభం, కవితా ఝరీ వంటి కవితా సంపుటాలను వెలువరించారు. అనంతరం ‘కట్నం కథలు’ -1983లో రచించారు. కథ, నవలా రచనలపై పట్టు సాధించారు. ‘ఘర్మజలానికి ఖరీదు కట్టే శరాబు లేడు’, ‘రాజుకోడి’, ‘మా కథలు’, ‘అవ్వతోడు గిది తెలంగాణ’, ‘కాలువ మల్లయ్య కథలు’, ‘బతుకు పుస్తకం’ (నవల), ‘చెప్పుల తయారి’, అస్పృశ్య కోయిల’, ‘గువ్వల చెన్నా’, ‘చీకట్లో చిరుదీపం’, ‘తెలంగాణ దేవదాసు’, ‘మాట్లాడే బొమ్మలు’, ‘భూమి పుత్రుడు’, ‘సాంబయ్య చదువు’, ‘మాదిగ విజయం’, ‘బాంచెన్ కాల్మొక్త’, ‘కాలువ మల్లయ్య నవలలు’, ‘ఆంబోతు’, ‘యుద్ధభూమి’ వంటి రచనలు ఆయనకు చిరకీర్తిని తెచ్చిపెట్టాయి.

‘అంటరానితనం అంబేద్కర్’, ‘మట్టి కథలు’ వంటివి చిన్న నవలికలను రచించారు. ‘తొమ్మిది పదుల తెలుగు కథ’, ‘నేలతల్లి’ (కథా సంపుటి), ‘తెలంగాణ కథబె కథ’, ‘తెలంగాణ భాష తల్లి’, ‘అమ్మ భాషను అభిమానిద్దాం’, ‘నా తెలంగాణ వ్యాసాలు’, ‘మీ రాజ్యం మేరేలండి’ వంటి వ్యాసాలు ప్రచురించారు.

మన జీవన నిధి ‘గుమ్మి’ 

ఇటీవల ఆయన వెలువరించిన ‘గుమ్మి’ తెలంగాణ పదకోశం విశిష్టమైన ఆయన ప్రతిభకు తార్కాణం. తెలంగాణ మట్టి మనిషి, పల్లెవాసి, ఉన్నత విద్యావంతుడైన మల్లయ్య వెలువరించిన ఈ పదకోశం భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆయన నిరంతరం తెలంగాణ ప్రజా స్థితిగతులపై విలువైన రచనలు చేస్తున్నారు.

మొదట ఉపాధ్యాయుడిగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి, అనంతరం గోదావరిఖనిలోని ‘ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (కేంద్ర ప్రభుత్వ కంపెనీ)లో కెమిస్టు ఆఫీసర్‌గా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించారు. ఉపాధ్యాయుడిగా, లెక్కల మాస్టారుగానూ పనిచేసిన మల్లయ్య, గోదావరిఖని ఫ్యాక్టరీ ఉద్యోగం ద్వారా కార్మికుల స్థితి గతులపై అధ్యయనం చేశారు.

సింగరేణి కార్మికుల జీవితాలను అర్థం చేసుకున్నారు. వారి స్థితిగతులపై ఎన్నో కథలు వెలువరించారు. ఎఫ్‌సీఐ ఫ్యాక్టరీ మూత పడటంతో స్వయంగా కుటుంబపరంగా ఎన్నో ఇక్కట్లను ఎదుర్కొన్నారు. బతుకు అర్థాన్ని స్వయంగా తెలుసుకున్నారు. 

సమస్యలకు పరిష్కారాలు కూడా!

కాలువ మల్లయ్య తన జీవితాన్ని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి హైదరాబాద్‌లో స్థిరబడి, రచనను వృత్తిగా స్వీకరించారు. తెలుగు అకాడమీలో పని చేస్తూ సమాజానికి తన వంతు సేవ చేస్తున్నారు. బహుళజాతి కంపెనీ అయిన ఎఫ్‌సీఐ మూత పడిన విధానం, అక్కడి కార్మికుల స్థితిగతులపై వాస్తవిక చిత్రీకరణతో ‘మెతుకు పుస్తకం’ నవల రాశారు.

మల్లయ్య కథ, నవల ఏది తీసుకున్నా వాస్తవాన్ని వ్యక్తీకరించడం, సమస్యలు, సంక్షోభాలకు తనవైన పరిష్కారాలను చూపడం కన్పిస్తుంది. తెలంగాణ ప్రాంతం లో ఆధిపత్య ధోరణులు, దళిత బహుజనులు దీన, భయంకర జీవితాలు, భాస్వామ్య వర్గాల దౌర్జన్యాలను తన రచనలలో విస్తృతంగా, లోతుగా చిత్రిం చారు. బడా భూస్వాములు, వారి మనస్తత్వాలు, వారి కింద పనిచేసే పాలేర్లు, రైతుకూలీల స్థితిగతులకు అద్దం పట్టారు.

మధ్యతరగతి ప్రజల బతకలేని తనం, పేదరికం దారిద్య్రాలను మల్లయ్య అక్షరబద్ధం చేసిన తీరు అసామాన్యం. ఇలాంటి రైతాంగ సాయుధ పోరాటం, జగిత్యాల జైత్రయాత్ర వంటి చారిత్రక పోరాటాల నాటి పరిస్థితులు మల్లయ్య కథలు, నవలల్లో దర్శనమిస్తాయి. మల్లయ్యది నైతిక, సామాజిక, మానవతా ధృక్పథం. సమాజాన్ని మార్చాలనే తపన, దోపిడీ అంతం కావాలనే ధ్యేయం తన రచనల్లో అంతర్లీనమై ఉంటుంది.

నిరక్షరాస్యత నుంచి మానవీయత వరకు!

‘సంఘర్షణ’ కథలో రైతుల నిరక్షరాస్యతను ఆసరా చేసుకొని వడ్డీ వ్యాపారులు ఎలా మోసం చేస్తారో చిత్రీకరించారు. ‘భస్మాసుర హస్తం’ కథలో నర్సిరెడ్డి అనే రైతు సావుకారివద్ద అప్పు తీసుకొని నష్టపోతాడు. తిరిగి అతనివద్దే అప్పు తెచ్చి మళ్ళీ నష్టపోతాడు. తీర్చలేని స్థితిలో భూమినీ కోల్పోతాడు. అలా, అప్పు భస్మాసుర హస్తం కాగా, అతను ఆ భూమిలోనే ప్రాణాలు వదులుతాడు.

రైతుకు భూమి కన్నతల్లి వంటిది. నర్సిరెడ్డి కథ హృదయాల్ని కదిలిస్తుంది. ‘సాయుధం’ కథలో సిద్ధాంత ప్రాతిపదికతో నడిచిన సాయుధ పోరాటాలే ఈ శతాబ్దిని శ్రామికవర్గ దృక్పథం వైపు మరల్చగలిగాయని నిర్ధారించిన మహేష్ అభిప్రాయంతో శంకరలింగం ఏకీభవించడంతో కథ ముగుస్తుంది. ‘మళ్ళీ తల్లి ఒడిలోకి’ రామగుండం ఎరువుల కర్మాగారం మూతబడి పోతుందనే సంకేతాలు అందిన సమయంలో వచ్చిన కథ. 

‘అమ్మమీది సొమ్ములు’ కథ మనిషిలోని స్వార్థాన్ని బట్టబయ లు చేస్తుంది. అమ్మ చనిపోయాక ఆమెమీది సొమ్ములను పంచుకోవడానికి అన్నాచెల్లెండ్లు పడే పాట్లు, అందుకోసం చూపే కృత్రిమ ప్రేమ, మనుషుల మనస్తత్వాన్ని ఎత్తి చూవుతుంది. పెద్ద మనుషుల మధ్య ఆ నగలు పంచుకోవాలని అనుకున్నప్పుడు అవి గిల్డ్ నగలని తెలుస్తుంది.

నగలలాగే వారి ప్రేమ కృత్రిమమైందనే విషయాన్ని మల్లయ్య చిత్రించిన తీరు నేటి అమానవీయ సంబంధాలను తెలియజేస్తుంది. ‘మమ్మీ డాడీ కథలు’లో ఇంగ్లీషు మీడియం చదువులవల్ల మనం ఎలా పరాయీకరణకు గురవుతున్నామో తెలుస్తుంది. ఈ కథలో రిటైర్డ్ హెచ్.యం. వెంకట్రా మయ్య పట్నంలో పెద్ద ఉద్యోగంలో వున్న చిన్నకొడుకు వద్దకు వెళ్తాడు.

అక్కడ పిల్లలు ‘మమ్మీ, డాడీ, అంకుల్’ అంటూ ఇలాంటి పదాలు వాడటంతో వెంకట్రామయ్య కలత చెందుతాడు. మాతృభాష అదృశ్యమై పోతుందని బాధ పడ్తాడు. కాలువ మల్లయ్య కథలలో ఎత్తుగడ, ముగింపు వర్ణన, పాత్రోచిత సంభాషణ వంటివి ఎంతో నేర్పుతో కనిపిస్తాయి. సహజ సిద్ధమైన వర్ణనా నైపుణ్యం అతనికి అలవడిన ఉత్తమగుణం.

గతంలో ఆయన ప్రభుత్వ అధికార భాషా సంఘం రాష్ట్ర సభ్యులుగా కొనసాగారు. మాతృభాషను అన్ని స్థాయిల్లో నిర్బంధం చేయాలని కృషి చేశారు. కాలువ మల్లయ్య సాహిత్యం సమాజంలో ఉన్నతిని నిల్పడానికి తన వంతు పాత్రను పోషిస్తున్నది. దళిత బహుజనుల జీవితాలలో వెలుగు నింపడానికి ఆయన నిరంతరాయంగా కృషి చేస్తున్నారు.

డా. సందినేని రవీందర్

9491078515