calender_icon.png 10 January, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం

01-01-2025 01:11:47 AM

  1. అపహరించి రూ.60వేలకు అమ్మకం
  2. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల గుర్తింపు, అరెస్టు
  3. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన తాండూర్ కాప్స్

వికారాబాద్, డిసెంబర్ 31(విజయక్రాంతి): తాండూరు పరిధిలో ఏడాది బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. డబ్బుకోసం ఆశపడి బాలుడిని అపహరించిన వ్యక్తులు కటకటాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు.. తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి వలస వచ్చి జీవనం సాగిస్తున్న భాషా తన భార్య గోరేబీతో కలిసి ఆదివారం రాత్రి గ్రామంలోని దేవాలయం వద్ద నిద్రిస్తున్న సమయంలో వారి ఏడాది కొడుకును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకపోయారు.

దీంతో బాధిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కరణ్‌కోట్ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఎట్టకేలకు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. తాండూరు ఇందిరానగర్‌కు చెందిన చరణ్, పట్టణంలోని ఫ్లుఓవర్ బ్రిడ్జి కింద నివాసం ఉండే శంకర్, పద్మమ్మ, హన్మంతు, లక్ష్మీ, సాయమ్మను అనుమానితులుగా గుర్తించి విచారించగా వారు నేరం అంగీకరించారు.

చిత్తు కాగితాలు సేకరించే క్రమంలో బాలుడి తండ్రి భాషతో వీరికి పరిచయం ఏర్పడింది. భాష వద్ద బాలుడు ఉన్న విషయం తెలిసి వారు కిడ్నాప్‌కు ప్లాన్ చేశామన్నారు. ఆరుగురు కలిసి 29న రాత్రి బాలుడిని అపహరించారు. అనంతరం తాండూరులోని కృష్ణ అనే వ్యక్తికి అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. కృష్ణకు ఆరుగురు కూతుళ్లే ఉండటంతో బాలుడిని కొనేందుకు సిద్ధమయ్యాడు.

అందుకు నిందితులకు రూ.60వేలు ఇచ్చి బాబును తీసుకున్నాడు. నిందితులు ఒక్కొరు రూ.10వేలు వాటా తీసుకొని వెళ్లిపోగా కృష్ణ బాలుడిని తీసుకొని మర్పల్లి మండలం పాషాపూర్‌కు వెళ్లిపోయాడు. నిందితుల ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు కృష్ణ నుంచి బాలుడిని స్వాధీనం చేసుకున్నారు.

తాండూరు సీఐ నగేష్, కరణ్ కోట్ ఎస్‌ఐ విఠల్ రెడ్డి మంగళవారం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడి కిడ్నాప్ కేసు ఛేదించిన కానిస్టేబుళ్లు ప్రతాప్, దస్తప్ప, మహేష్, రవి, నర్సిహులును  ఉన్నతాధికారులు అభినందించారు.