న్యూయార్క్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చిన న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియం కథ కంచికి చేరింది. కేవలం వరల్డ్‌కప్ మ్యాచ్‌ల కోసమే ప్రత్యేకంగా నిర్వహించిన స్టేడియాన్ని స్థానిక అధికారులు కూల్చేశారు. ప్రపంచకప్‌కు అమెరికా ఆతిథ్య హక్కులు పొందిన వెంటనే అమెరికా క్రికెట్ అసోసియేషన్ న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్ ఐసన్‌హోవర్ పార్క్‌లో తాత్కాలిక స్టేడియం నిర్మించేందుకు అనుమతులు తీసుకుంది. ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత అడిలైడ్ స్టేడియం నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన డ్రాప్ ఇన్ పిచ్‌లతో కేవలం 100 రోజుల్లోనే స్టేడియాన్ని నిర్మించారు. 34వేల సామర్థ్యంతో సీటింగ్ కెపాసిటీని ఏర్పాటు చేశారు. ఈ స్టేడియంలో బుధవారం టీమిండియా, అమెరికా మధ్య ఆఖరి మ్యాచ్ జరిగింది.
మ్యాచ్ ముగిసిన మరుక్షణమే స్టేడియం కూల్చివేతకు అధికారులు అంతా సిద్ధం చేశారు. పెద్ద పెద్ద బుల్డోజర్లతో స్టేడియంలోని పరికరాలను క్షణాల్లో తొలగించారు. ప్రపంచకప్‌లో మొత్తం 8 మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన నసావు కౌంటీ స్టేడియంను అత్యంత ప్రమాదకర పిచ్‌గా క్రీడా పండితులు అభివర్ణించారు. బౌలర్లకు విపరీతంగా సహకరిస్తున్న పిచ్‌పై బ్యాటింగ్ చేసేందుకు ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. ఐదు నెలల్లోనే తయారు చేసిన మైదానంలో డ్రాప్ ఇన్ పిచ్‌ను ఉపయోగించారు.
గడ్డి ఎక్కువగా ఉండడంతో ఈ పిచ్ పేసర్లకు స్వర్గధామంగా మారింది. అధిక బౌన్స్, స్వింగ్‌తో బౌలర్లు వికెట్ల పండగ చేసుకోవడంతో దాదాపు ప్రతీ మ్యాచ్‌లో లో స్కోరింగ్‌లే నమోదయ్యాయి. ఈ స్టేడియంలో అత్యధిక స్కోరు 137 కాగా.. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో కెనడా ఈ స్కోరును అందుకుంది. ఈ మైదానంలో అమెరికాపై టీమిండియా చేధించిన 111 పరుగులే అత్యుత్తమ ఛేదనగా నిలవడం విశేషం.