calender_icon.png 19 January, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘అరి’ కథ.. ఆది నుంచీ ఆసక్తే!

11-08-2024 12:26:48 AM

‘అరి’.. పేరే కాదు ఈ సినిమా కథ కూడా పూర్తి భిన్నమైనదే. చెడు అనేది కొంతవరకు మంచికే అని చెప్తున్నాం కాబట్టి ఆరంభం నుంచీ అన్నివర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది మా ఈ చిత్రం. దీనికి ‘మై నేమ్ ఈజ్ నోబడీ’ అనేది ఉపశీర్షిక. ‘అరి’ అనే పదానికి అర్థం ఏమిటిన్న దగ్గర నుంచి ఈ సినిమాపై చర్చలు, అంచనాలు ప్రారంభమయ్యాయి. అరిషడ్వర్గాలలోని తొలి రెండు అక్షరాలే ఈ సినిమా టైటిల్. అరి అంటే ‘శత్రువు’ అని అర్థం. అరిషడ్వర్గాలు అంటే ఆరు అంతర్గత శత్రువులు. ఆ అరిషడ్వర్గాలను జయిస్తే భగవత్తత్వం బోధపడుతుంది.

మనిషికి నిజమైన శత్రువులైన అరిషడ్వర్గాలను ఈ సినిమాలో ఎలా చూపించామనేది తెరపైనే చూడాలి. నా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండో సినిమా ఇది. శ్రీకృష్ణ భగవానుడి గురించి ఎవరూ చెప్పని కథతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. అరిషడ్వర్గాలను వివిధ పాత్రలకు ఆపాదిస్తూ కథ రాసుకున్నా. ఈర్ష్య, అహంకారం, అత్యాశ, అనుబంధం, కోపం, కామమే మా చిత్రంలో అత్యంత ప్రధాన పాత్రలు. ఈ పాత్రల్ని పలువురు సీనియర్ నటీనటులు పోషించారు.

‘అరి’ ఫిలాసఫికల్ మూవీ. మనిషి ఎలా బతకాలి.. ఎలా బతకకూడదు అనే అంశాన్ని తాత్విక కోణంలో తెలియజేస్తున్నాం. ఇందులోని పాత్రల స్వభావాలను బట్టి కూడా మనం మంచి, చెడుల తారతమ్యాన్ని తెలుసుకోవచ్చు. ఇది ఒక ఆలోచింపజేసే ప్రయత్నం. ‘పేపర్ బాయ్’ని అమెరికాలో రిలీజ్ చేసినప్పుడు అక్కడ ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆర్‌వీ రెడ్డి గారు మా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆయనే ఇప్పుడు నాయుడు, శేషు మారంరెడ్డితో కలిసి ‘అరి’ని నిర్మించారు.