15-03-2025 12:01:27 AM
‘మంచి కుటుంబం’.. 1968, మార్చి 15న విడుదలైంది. ఇది ఓ నాటక చిత్రం. అక్కినేని నాగేశ్వరరావు, షావుకారు జానకి, కాంచన, కృష్ణ, విజయ నిర్మల తదితరులు నటించారు. ఇది అమెరికన్ మూవీ ‘ది రిమార్కబుల్ మిస్టర్ పెన్నీప్యాకర్’ (1959) ఆధారంగా తెరకెక్కిన హిందీ చిత్రం ‘గ్రహస్తి’ (1963)కి రీమేక్. ఈ తెలుగు వెర్షన్‌కు వీ మధుసూధనరావు సహ-రచయితగా వ్యవహరిస్తూ దర్శకత్వం వహించారు.
కథ విషయానికొస్తే.. వేణుగోపాల్‌రావు (ఏఎన్నార్) ఓ పారిశ్రామికవేత్త. తన భార్య శాంత (షావుకారు జానకి), పిల్లలతోపాటు అక్క, మేనల్లుడు పాండు (చలం)తో జీవితాన్ని గడుపుతాడు. మేనల్లుడి నిశ్చితార్థం సమయంలో చిన్న అనే యువకుడు తాను వేణుగోపాల్‌రావు సంతానం అని చెప్పడం.. వేణుగోపాల్‌రావు తన రెండో భార్య గురించి చెప్పడం విని అతని భార్య శాంత నిశ్చేష్టురాలవుతుంది.
తర్వాత తన సవతి ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది శాంత. తన సోదరి శారదనే తన సవతి అని తెలిసి కుప్పకూలిపోతుందామె. మరి వేణుగోపాల్‌రావు ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? శారద కూడా తన భార్యేనన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పకుండా ఇంత కాలం రహస్యంగా దాచి ఉంచటానికి కారణం ఏంటి? శారద నిజంగానే చనిపోయిందా? అనే విషయాలన్నీ ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తాయి?
కథ అంతా అర్థమైన తర్వాత నిజంగానే ఇది ‘మంచి కుటుంబం’ కథ ఇది అని ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రమిది. ఇంకా ఈ సినిమాలోని మరో గొప్ప విషయం పాటలు! ఎవర్ గ్రీన్ సాంగ్ ‘మనసే అందాల బృందావనం..’ ఈ సినిమాలోనిదే కావడం విశేషం. దీన్ని ఆరుద్ర రచించగా, పీ సుశీల ఆలపించారు. సినారె రాసి, ఘంటసాల ఆలపించిన మరో పాట ‘త్యాగశీలివమ్మా మహిళ..’ కూడా ఇప్పటికీ చైతన్య గీతంగా జనం నోళ్లల్లో నానుతుండటం అందరికీ తెలిసిందే.