బ్రహ్మచారి చిత్రం 1 ఫిబ్రవరి 1968లో విడుదలైంది. ప్రసాద్ ఆర్ట్ బ్యానర్‌పై ఏవీ సుబ్బారావు నిర్మించారు. టి. రామారావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం లో అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత ప్రధాన పాత్రలు పో షించారు.
హనుమంతుని భక్తుడైన రామకృష్ణ బ్రహ్మచర్య దీక్ష చేపడతాడు. రామకృష్ణ చదివే కాలేజీలోనే వసంత కూడా చదువుతూ ఉంటుంది. ఒకసారి కాలేజ్ అంతా పిక్నిక్‌కి వెళుతుంది. అక్కడ వసంత తన లాకెట్ పోగొట్టుకుంటుంది.
రామకృష్ణకు దొరకడంతో దానిని వసంతకు ఇస్తాడు. అయితే రామకృష్ణ స్నేహితుడు వసంతకు రామకృష్ణ రాస్తున్నట్టుగా సరదాగా ఒక ప్రేమలేఖ రాస్తాడు. ఆ తరువాత వసంత కూడా రామకృష్ణను ప్రేమిస్తుంది. ఈ విషయాన్ని అతనికి చెబితే నిరాకరిస్తాడు.
ఆ తరువాత కొంత కాలానికి వసంత ఒక బిడ్డతో రామకృష్ణ ఇంటికి వస్తుంది. తనను రహస్యంగా రామకృష్ణ వివాహం చేసుకున్నాడని.. తమకు ఒక పిల్లవాడు పుట్టాడని చెప్పి వాళ్లింట్లో సెటిల్ అయిపోతుంది. అసలు ఆ బిడ్డ ఎవరు? వసంత చెప్పేది నిజమేనా? ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది? అనే ఆసక్తికర విషయాలతో సినిమాను రూపొందించారు.