09-04-2025 02:23:37 AM
పంటలకు పెను నష్టం
నేలకొరిగిన వందల చెట్లు
తెగిపడ్డ విద్యుత్తు లైన్లు
నిరాశ్యులైన పేదలు
మహబూబాబాద్, ఏప్రిల్ 8 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టిం చింది. రాళ్లతో కూడిన గాలివాన కు అపార నష్టం సంభవించింది. వందల ఇండ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. వందలాది వృక్షాలు నేలకూలాయి. పలుచోట్ల విద్యుత్తు లైను తెగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటకు రాళ్ల వానతో తీవ్ర నష్టం సంభవించింది. అనేక ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట రాళ్లవానకు దాన్యం నేల రాలింది. ఆరబోసుకున్న మక్కలు, మిర్చి పంట ఉత్పత్తులు తడిసిపోయాయి. మహబూబాబాద్ జిల్లాలో పలు ప్రధాన రోడ్లపై చెట్లు విరిగి పడటంతో ట్రాఫిక్ స్తంభించింది.
హుటాహుటిన పోలీసులు స్పందించి రోడ్లపై అడ్డుగా పడ్డ చెట్లను జేసీబీలతో తొలగించి అర్ధరాత్రి దాటిన తర్వాత రాకపోకలు పునరుద్ధరించారు. ఇండ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో అనేకమంది పేదలు నిలువ నీడ లేక నిరాశ్యులయ్యారు. కేసముద్రం మండలం పెద్ద మోరి తండాలో తేజావత్ రాములు ఇంటి పై కప్పుకు వేసిన సిమెంటు రేకులు రాళ్ల వరకు దెబ్బతిని మీద పడడంతో రాములు కాలు విరిగింది. కేసముద్రం పట్టణంలోని పాక కొమరమ్మ ఇల్లు పైకప్పు పూర్తిగా గాలికి ఎగిరిపోయింది. మానుకోట జిల్లాలో గాలివాన పేదల కుటుంబాల్లో పెను విధ్వంసాన్ని సృష్టించింది.