కడుపు నింపని కళ
వరంగల్ నగరంలోని కొత్తవాడలో తయారయ్యే దర్రీలకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. విదేశాలకు ఎగుమతి అయి ఔరా అనిపించుకున్న ఈ దర్రీల వల్ల ఓరుగల్లుకు ఖ్యాతి లభించింది. ఈ దర్రీల చరిత్ర ఘనమైనదైనా, వాటిపై ఆధారపడిన చేనేత కుటుంబాలది దయనీయ గాథే. సరైన మార్కెటింగ్ లేక, నెలంతా కష్టపడ్డా ౨౦ వేల రూపాయలు కూడా ఆ కార్మికులకు గిట్టుబాటుకావడం లేదు.
ఏళ్లుగా జీవన పోరాటం
ఎనకట వరంగల్ దర్రీలకు భలే డిమాండ్
పనిలేక ఆదాయం నిల్
హనుమకొండ, ఆగస్టు 31 (విజయక్రాంతి): వరంగల్ దర్రీల(జంపఖానా)కు ప్రపంచ దేశాల్లో మంచి మెప్పు ఉంది. నేతన్నల జీవితాలు మాత్రం మారడం లేదు. ఎన్నో ఏళ్లుగా కులవృత్తిని నమ్ముకుని బతుకుపోరు సాగిస్తున్నా.. అనారోగ్యమే తప్ప ఆదాయం లేకుండా పోతోంది. అప్పుడప్పుడు వస్తున్న ఆర్డర్లతో ఉత్పత్తులు తయారు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నప్పటికీ అంతగా గిట్టుబాటు కావడంలేదని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చాలీచాలనీ ఆదాయంతో బతుకుబండి నడపడం కష్టతరమైనట్లు చెబుతున్నారు. కొంతమందికి పనులు లేక, మరికొంతమందికి పనులు రాక ఇతర వృత్తులపై ఆధారపడుతున్నట్లు పేర్కొంటున్నారు. అయితే నెలంతా పనిచేస్తే రూ.20 వేలకు మించి గిట్టుబాటు కావడం లేదని చెబుతున్నారు. దీంతో చాలా మంది ఈ పని చేయడానికి ఇష్టపడటం లేదని వాపోతున్నారు. దీంతో చాలా మంది పొట్టకూటి కోసం ఇతర వృత్తుల వైపు వెళ్తున్నారు. కొత్తగా పని నేర్చుకునే వారే కరువయ్యారు.
భవిష్యత్‌లో మగ్గం అంటే గూగుల్‌లో వెతికి చూసుకోవాల్సిన పరిస్థితులు తప్పవని చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. వరంగల్ నగరంలోని కొత్తవాడలో చేనేత కార్మికులు సమారు 2 వేల మంది దర్రీలను కళాత్మకంగా తయారుచేసి జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ తయారవుతున్న దర్రీలకు ప్రపంచ దేశాల్లో విశేషమైన గుర్తింపు ఉంది. ఇవి బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఆమెరికా, రష్యా దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇటీవల రష్యాలోని భారత రాయబార కార్యాలయంలో వరంగల్ కలంకారీగా పిలుచుకునే దర్రీలను ప్రదర్శించారు.
డిమాండ్ ఉన్నా మార్కెటింగ్ సున్నా..
వరంగల్‌లో తయారవుతున్న ఉత్పత్తులు విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ అందుకు తగిన విధంగా మార్కెట్ ఉండటం లేదనేది ఇక్కడి కార్మికుల వాదన. దర్రీలకు సంబంధించి నైపుణ్యత కలిగిన కార్మికులు కొంతమంది మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్లు ఇతర ఉత్పత్తులు తయారుచేస్తారు. కానీ దర్రీల తయారీ అనేది కళ. దాని మగ్గంపై ప్లేన్‌గా తయారు చేస్తారు. తర్వాత ఫినిషింగ్ కోసం మచిలీపట్నంకు పంపాల్సి ఉంటుంది. అక్కడ వాళ్లు ఆర్డర్‌లో పేర్కొన్న డిజైన్‌తో ప్రింటింగ్ చేసి ఇక్కడికి పంపిస్తారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తే తయారుదారుడికి మిగిలేదీ పెద్దగా ఏమీ ఉండదని కళాకారుడు రవి చెబుతున్న మాటలు.
బల్క్ ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రమే కాస్త డబ్బు లు కనపడతాయి. ఒకటి రెండు ఆర్డర్లు వచ్చినప్పుడు శ్రమ ఉంటుందే తప్ప అంతగా గిట్టుబాటు కాదు. సాధారణంగా ప్రతి ఏడా ది రెసిడెన్సియల్ పాఠశాలలు ప్రారంభానికి ముందు పిల్లలకు కార్పెట్స్, బెడ్‌షీట్లు తయారుచేసే ఆర్డర్లు వస్తుంటాయి. జూలై నుంచి నవంబర్ వరకు ఈ పని ఉంటుంది. తర్వాత చెప్పుకోదగ్గ పని అంటూ ఏదీ ఉండదు. చేనేత కో ఆపరేటివ్ సొసైటీల ద్వారా వచ్చే ఈ పనులకు కూడా ముందుగా పెట్టుబడి పెట్టి ఉత్పత్తులు అందించాల్సి ఉంటుంది. కానీ వాళ్లు మాత్రం 3, 4 నెలలకు గానీ బిల్లులు ఇవ్వరు. దీంతో వచ్చే కొద్దిపాటి ఆదాయం, పెట్టిన డబ్బులకు వడ్డీలకే సరిపోతుందని చెబుతున్నారు.
పనిచేసే వాళ్లు తక్కువయ్యారు
చేనేత ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ పనిచేసే వాళ్లు రోజురోజుకు తగ్గిపోతున్నారు. కేవలం ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లు మినహా ఇతర సంస్థల నుంచి చెప్పుకోదగిన ఆర్డర్లు రావడం లేదు. ఏడాదిలో ఆరు నెలలు పని ఉంటే మిగతా ఆరు నెలలు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నట్లు కార్మికులు చెబుతున్నారు. కొత్తగా ఈ కళను నేర్చుకునేందుకు నేటితరం అంతగా ఇష్టపడటం లేదు. గతంలో మగ్గం పని వచ్చిన వాళ్లకే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేందుకు ముందుకు వచ్చేవారు.
ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఆ పనిచేసే వాళ్లకు ఇప్పుడు అమ్మాయిని ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పరిస్థితుల్లో మార్పు వచ్చింది. దీంతో చేనేత కార్మికులు వారి పిల్లలకు మగ్గం పని నేర్పించేందుకు ఇష్టపడటం లేదు. దీనికి తోడు ఉపాధి లేక మగ్గంపని వాళ్ల కాళ్లు, చేతులు దెబ్బతిని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా మంది కార్మికులు ఉప్పరి పని, పండ్లు, కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. చేతకాని వాళ్లు సెక్యూరిటీ గార్డ్ లాంటి ఇతర పనులకు వెళ్తున్నట్లు పేర్కొంటున్నారు.
కరోనా తర్వాత పరిస్థితి మరింత దుర్భరంగా తయారైంది. ప్రస్తుతం మారిన మార్కె ట్‌కు అనుగుణంగా పోటీ పడేందుకు ఆన్‌లైన్ విధానంలో ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నట్లు కార్మికులు చెబుతున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లాంటి యాప్‌ల ద్వారా తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. కానీ ఆశించిన మేరకు ఫలితం ఉండటం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేనేత కార్మికు లను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆప్కో సంస్థ ద్వారా ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడమే కాకుండా పేమెంట్ కూడా వెంటనే జరిగేలా చర్యలు తీసుకున్నారు.
అదే మాదిరిగా ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకునేందుకు పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. బడ్జెట్‌లో కూడా చేనేత కార్మికులకు కేటాయింపులు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేత కార్మికులను విస్మరించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వా ల మాదిరిగా కాంగ్రెస్ సర్కార్ చేనేతల ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలి. ఆప్కో, టెస్కో సంస్థలను పునరుద్ధరించి చేనేత ఉత్పత్తులను ప్రమోట్ చేయాలి. దేశ విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను బట్టి చేనేత ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని కార్మికు లు కోరుతున్నారు. చేనేత కళ బతకాలన్నా.. కార్మికుల బతుకులు మారాలన్నా.. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఉపాధి మార్గాలు చూపించాలని నేతన్నలు కోరుతున్నారు.
ప్రభుత్వం చొరవ చూపాలి
చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉంది. కానీ ఉత్పత్తులు తయారుచేస్తున్న కార్మికులకు మార్కెటింగ్ చేసే పరిస్థితి లేదు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలి. ఆ అధికారి ద్వారా చేనేత ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెటింగ్ చేయాలి. పత్తి, మిర్చి లాంటి పంటలను ఏ విధంగా ఎగుమతి చేస్తున్నారో అదే విధంగా చేనేత ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు చర్యలు చేపట్టాలి. అంతేగాకుండా నూలు లాంటి ముడి సరుకులను ప్రభుత్వమే సబ్సిడీపై అందజేసేలా ప్రణాళికలు రూపొందించాలి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను బట్టి మేమే ఆన్‌లైన్‌లో మార్కెటింగ్ చేస్తున్నాం. అవర్ వీవర్స్ హౌస్ పేరిట ఇన్‌స్ట్రాగ్రాం పేజ్‌లో ఉత్పత్తులను అమ్ముతున్నాం. ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలి. లేకుంటే భవిష్యత్‌లో చేనేత కళ అంతరించడం ఖాయం.
చిప్ప వెంకటేశ్వర్లు,
చేనేత కార్మిక సంఘం
గౌరవ అధ్యక్షుడు, వరంగల్