calender_icon.png 29 September, 2024 | 12:58 PM

లాభాల బాటలోనే స్టాక్ మార్కెట్

18-09-2024 12:02:29 AM

సెన్సెక్స్ 83,000 పాయింట్లకు పైన.. 25,400 ఎగువన నిఫ్టీ

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు  లాభాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకొనేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశమైన నేపథ్యంలో ఓ వైపు మదుపర్లు అప్రమత్తత పాటించినప్పటికీ..అంతర్జాతీయ మార్కెట్లు నుంచి సానుకూల సంకేతాలకు తోడు భారతీ ఎయిర్‌టెల్, ఎల్‌అండ్‌టీ షేర్ల అండతో సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 83 వేల ఎగువన, నిఫ్టీ 25,400 స్థాయి ఎగువన రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి.

సెన్సెక్స్ ఉదయం 83,084.63 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 82,988.78) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. తర్వాత కాసేపు నష్టాల్లోకి జారుకున్నా తిరిగి కోలుకుంది. ఇంట్రాడేలో 82,866.68- 83,152.41 మధ్య చలించిన సూచీ.. చివరికి 90 పాయింట్ల లాభంతో 83,079.66 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 34.80 పాయింట్ల లాభంతో 25,418.55 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.75గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, ఎల్‌అండ్‌టీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. టాటా మోటార్స్, అదానీ పోరట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.26 డాలర్లు, బంగారం ఔన్సు ధర 2601.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.