17-03-2025 04:57:12 PM
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ..
ముషీరాబాద్ (విజయక్రాంతి): ఫోటోగ్రఫీలో తెలంగాణ, త్రిపుర రాష్ట్రాలకు గొప్ప చరిత్ర ఉందని, ఆ రోజుల్లో దేశంలో ప్రప్రథమంగా ఫోటో కెమెరాలు కొనుగోలు చేసి ఫోటోగ్రఫీని అభివృద్ధి పరిచిన ఘనత హైదరాబాద్, త్రిపుర సంస్థానాలకే దక్కిందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Telangana State Governor Jishnu Dev Verma) అన్నారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్(Telangana State Photojournalist Association) నిర్వహించిన ఉత్తమ ఫోటో జర్నలిస్టులకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం(World Photography Day) సందర్బంగా ఉత్తమ వార్త, తెలంగాణ పండుగలు, సాంస్కృతిక విభాగాల్లో తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త ఫోటోగ్రఫీ పోటీలలో విజేతలైన ఉత్తమ ఫోటో జర్నలిస్టులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అవార్డులను అందజేశారు. అనంతరం గవర్నర్ ప్రసంగిస్తూ వెయ్యి మాటల కన్నా ఒక్క ఫోటో ఎంతో గొప్పదన్నారు. పత్రికల్లో ఎన్నో వార్తలు ప్రచురితమైనా పాఠకుల దృష్టిని ఆకర్షించేది ఫోటోలు మాత్రమేనని జిష్ణు దేవ్ వర్మ స్పష్టం చేశారు. చరిత్రలో రికార్డుగా ఉండి పోయేది ఫోటోలే అన్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) ప్రభావంతో పత్రికలకు ఆదరణ తగ్గి పోతుందని చర్చ జరుగుతుందని, కానీ ఇది తాత్కాలికం మాత్రమేనని, భవిష్యత్తు పత్రికలకే ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, అఖిల భారత రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తుడి దేవేందర్ రెడ్డి, టీయూడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గంగాధర్, కె.ఎన్.హరి తదితరులు పాల్గొన్నారు.