calender_icon.png 26 December, 2024 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగుల పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది

07-11-2024 04:48:59 PM

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ముషీరాబాద్ (విజయక్రాంతి): నిరుద్యోగుల పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, స్వరాష్ట్రం ఏర్పడితే నియామకాలు దక్కుతాయని నిరుద్యోగులు భావించారని డిప్యూటి సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు. కానీ గత 10 ఏళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ దిశగా పని చేయలేదని, కానీ తమ ప్రభుత్వం నిరుద్యోగుల ఆకాంక్షను నెరవేరుస్తుందన్నారు. ఈ మేరకు గురువారం  హైదరాబాద్ అశోక్ నగర్ లో రావుస్ అకాడమీని అకాడమీ చైర్మన్ డాక్టర్ మోహన్ రావుతో కలిసి బట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీజీపిఎస్సి ను ప్రక్షాళన చేసిందని, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తూ  దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు.

ఇప్పటికే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం తమ లక్ష్యం అన్నారు. సివిల్స్ కు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం తరపున లక్ష రూపాయలు సహాయం అందిస్తున్నట్లు వివరించారు. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు ఇలాంటి అకాడమీలు ఎంతో దోహదపడుతాయని బట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి దినకర్ బాబు, స్థానిక కాంగ్రెస్ నాయకులు గుర్రం శంకర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.