calender_icon.png 9 February, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధరల కట్టడిలో రాష్ట్రం భేష్

09-02-2025 12:58:12 AM

  1. డిసెంబర్‌లో 3.14 శాతం ద్రవ్యోల్బణం నమోదు
  2. సూచీలో దేశంలోనే అత్యల్పంగా ఇన్‌ఫ్లేషన్ నమోదు 
  3. 9.4 శాతంతో టాప్-1లో మణిపూర్
  4. పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే అధిక ధరలు

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): నిత్యావసరాల ధరల నియంత్రణ లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. డిసెంబర్-2024 ద్రవ్యోల్బణం సూచీలో 3.14శాతంలో చివరిస్థానంలో నిలిచింది. డిసెంబర్‌లో జాతీయ రిటైల్ ద్రవ్యోల్బణం 5.22 శాతం కాగా.. నేషనల్ ఇన్‌ఫ్లేషన్ కంటే తెలంగాణ 2.08 శాతం తక్కువ ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసినట్టు కేంద్ర గణాంకాల శాఖ తెలిపింది.

దేశవ్యాప్తంగా గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే నిత్యావసరాల ధరలు తక్కువగా ఉన్నట్లు చెప్పింది. ఇదిలా ఉండ గా.. 2024, నవంబర్ తెలంగాణ ద్రవ్యోల్బణం 4.24 శాతం ఉండగా.. నెల తర్వాత ఏకంగా 1.1 శాతం ధరలు కట్టడి అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది డిసెంబర్‌లో అత్యధిక ద్రవ్యోల్బణం నమోదు చేసిన రాష్ట్రం మణిపూర్ కాగా..  ఛత్తీస్‌గఢ్, బీహార్, ఒడిశా, కేరళ రాష్ట్రాలు రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.

ఢిల్లీలో డిసెంబర్‌లో అత్యల్పంగా 2.51 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ఢిల్లీ తర్వాత తెలంగాణే అతి తక్కువ ఇన్‌ఫ్లేషన్ నమోదైన రాష్ట్రంగా నిలిచింది. అయితే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కావడం వల్ల.. రాష్ట్రా ల జాబితాలో తెలంగాణలో కింది నుంచి మొదటిస్థానంలో నిలిచినట్టు అవుతుంది.

కూరగాయల ధరలు తగ్గినా..

వాస్తవానికి డిసెంబర్‌లో కూరగాయలు, పప్పుధాన్యాలు, చక్కర, స్వీట్, లోషన్స్, తృణధాన్యాలు మొదలైన ఉత్పత్తుల ధరలు తగ్గాయి. కానీ బటానీలు, బంగాళదుంపలు, వెల్లుల్లి, కొబ్బరి నూనె, క్యాలీఫ్లవర్ రేట్లు భారీగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే, భారీగా ధరలు తగ్గిన నిత్యా వసరాల్లో జీలకర్ర, అల్లం, ఎండుమిరపకాయలు, ఎల్‌పీజీ ఉన్నట్లు పేర్కొంది.

బఠా నీల ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో అత్యధికంగా 89.12 శాతం కాగా.. బంగాళదుంపలు 68. 23 శాతంగా ఉన్నట్లు గణాంకాల శాఖ చెప్పింది. ఉత్పత్తి పెరగడం వల్లే తెలంగాణలో డిసెంబర్‌లో కూరగాయల ధరలు తగ్గి నట్లు తెలుస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 1,114 పట్టణాల్లో మార్కెట్లు, 1,181 గ్రామాల్లోని మార్కెట్లను అధ్యయనం చేసిన తర్వాత కేంద్ర గణాంకాల శాఖ ద్రవ్యోల్బణ జాబితాను వెల్లడించింది.

ధరలతో అల్లాడుతున్న పల్లెలు

నిత్యావసర ధరల్లో ఎక్కువ శాతం దేశవ్యాప్తంగా పట్టణాల్లో కంటే పల్లెల్లోనే మండిపోతున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ నివేదిక చెబుతోంది. జాతీయస్థాయిలో గ్రామీణ, పట్టణాల్లో ద్రవ్యోల్బణం వేర్వేరుగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. గతేడాది డిసెంబర్‌లో జాతీయ స్థాయిలో గ్రామాల్లో సగటు ఇన్‌ఫ్లేషన్ 5.76 శాతం నమోదు కాగా..

పట్టణాల్లో 4.58శాతం నమోదు కావడం గమనార్హం. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఇది తారుమారైంది. డిసెంబర్ గ్రామీణ ద్రవ్యోల్బణం 3.13 శాతం ఉండగా.. పట్టణాల్లో 3.20 శాతంగా ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పట్టణాలు, గ్రామాల మధ్య ద్రవ్యోల్బణంలో పెద్దగా తేడా లేకపోవడం గమనార్హం. 

విద్య, ఆరోగ్యంపై పట్టణాల్లోనే.. 

విద్య, ఆరోగ్యం విషయానికొస్తే.. గ్రామాల కంటే పట్టణాల్లోనే ఎక్కువ ఖర్చు పెడుతున్నట్లు నివేదిక చెబుతోంది. డిసెంబర్‌లో విద్య ద్రవ్యోల్బణం గ్రామాల్లో 3.72 శాతంగా ఉంటే, పట్టణాల్లో 4.04 శాతం ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.