- కులగణన పేరుతో ప్రజల ఆస్తులపై కన్ను
- ఆరు గ్యారెంటీల్లో ఒక్కటీ అమలు చేయలే
- తెలంగాణ పైసలన్నీ మహారాష్ర్టలో యాడ్స్‌కు..
- కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి) : ప్రతి పని, కాంట్రాక్టులో 15 శాతం కమీషన్ తీసుకుంటూ తెలంగాణను లూటీ చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
రాష్ట్ర ప్రజలకిచ్చిన ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా.. అన్ని హామీలు అమలు చేస్తున్నట్లు మహారాష్ర్ట ఎన్నికల్లో రూ. కోట్లు ఖర్చు పెట్టి యాడ్స్ ఇస్తూ అక్కడి ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహారాష్ర్ట ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి బుధవారం నాగ్‌పూర్‌లో మీడియాతో సమావేశమై మాట్లాడారు.
20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేదని వ్యవసాయశాఖ మంత్రి ప్రకటించినప్పటికీ పూర్తిగా మాఫీ చేసినట్లు మహారాష్ర్ట ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం చేసుకుం టోందన్నారు. తెలంగాణ సొమ్మును మహారాష్ర్ట ఎన్నికల్లో ఖర్చు చేస్తూ రాష్ట్రాన్ని మరింత దివాళా తీయిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ సీఎం మహారాష్ర్టకు వచ్చి మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలే. ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని చెప్ప డం అవాస్తవం. తెలంగాణ సొమ్మును వెచ్చించి మహారాష్ర్టలో యాడ్స్ ఇచ్చారు కానీ.. ఆ యాడ్స్‌లో ఆరు గ్యారంటీల ఊసే లేదు. తప్పుడు హామీలతో మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారు.
వాస్తవాలు చెప్పేందుకే మీ ముందుకొ చ్చాను. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. మ్యానిఫెస్టోలో పొందుపర్చిన 420 హామీలనూ అమలుచేయలేదు. ఎందుకంటే కాం గ్రెస్ 420 సర్కార్ అని సంజయ్ అరోపించారు.
హమీలన్నీ నీటి మూటలే..
తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలేనని సంజయ్ ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలోనూ తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను నిలువునా ముంచిందని విమర్శించారు. హర్యానాలోనూ ఇలాంటి హామీలతో అధికారంలోకి రావాలని చూస్తే అక్కడి ప్రజలు తిప్పికొట్టారని గుర్తు చేశా రు.
ఇప్పుడు మహారాష్ర్ట ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ లో కుల, జనగణన పేరుతో ఆస్తి వివరాలు సేకరించాలని చూస్తుంటే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని.. గత పది నెలల్లో దాదాపు 100కుపైగా దేవాలయాలపై దాడులు జరిగినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ఓటర్లను చీల్చే కుట్ర..
ఓటర్లను కులం, మతం ఆధారంగా చీల్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కుట్ర చేస్తోందని కేంద్రం మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 2004లో తెలంగాణలో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చింది కానీ.. సుప్రీంకోర్టు దానిని కొట్టివేసిందన్నారు.
ఇదే హామీని మహారాష్ర్ట ప్రజలకు చెబుతూ మరోసారి మోసం చేయాలని చూస్తోందన్నారు. కార్యక్రమంలో కర్ణాటక బీజేపీ ప్రతిపక్ష నేత నారాయణస్వామి, హిమాచల్‌ప్రదేశ్ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రాజీవ్ బిందాల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, తెలంగాణ బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు గంగడి మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.