calender_icon.png 2 February, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రానికి గుండు సున్నా

02-02-2025 01:33:44 AM

బడ్జెట్‌లో తెలంగాణ అన్న పదమే లేదు..

  1. కేంద్రానికి రాష్ట్రమంటే చిన్నచూపు 
  2. జాతీయ పార్టీలతో మొండిచేయేనని మరోసారి రుజువైంది..
  3. బడే భాయ్ రేవంత్.. చోటే భాయ్ మోదీ అనుబంధం నిరర్థకం 
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజలు జాతీయ పార్టీలను ఎన్నికల్లో గెలిపిస్తే, రాష్ట్రానికి మొండిచేయి చూపాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా అని వాపోయారు. కేంద్ర బడ్జెట్‌పై శనివారం ఆయన ‘ఎక్స్’ ద్వారా స్పందించారు.

ఎప్పటిలాగానే బడ్జెట్‌లో తెలంగాణ అన్న పదమే లేదని, దీన్నిబట్టి కేంద్రానికి రాష్ట్రంపై ఎంత చిన్నచూపు ఉందో మరోసారి రుజువైందని పేర్కొన్నారు. రాష్ట్రానికి చిల్లి గవ్వునా తీసుకురాలేకపోయిన సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

రెండు జాతీయ పార్టీల నుంచి 16 మంది ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నారని, ఆ పార్టీలు ఎప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని, అందుకు తార్కాణమే తాజాగా కేంద్ర బడ్జెట్ అని అభిప్రాయపడ్డారు. చోటే భాయ్ సీఎం రేవంత్‌రెడ్డి, బడే భాయ్ ప్రధాని మోదీ అనుబంధం నిరర్థకమైందని ఎద్దేవా చేశారు.

ఇతర రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు తమ రాష్ట్రాలకు నిధుల వరద పారిస్తుంటే, తెలంగాణ బీజేపీ ఎంపీలు మాత్రం చిప్ప చేతికి ఇచ్చే పరిస్థితిలో ఉన్నారని నిప్పులు చెరిగారు. పార్లమెంట్‌లో బీఅర్‌ఎస్‌కి ప్రాతినిథ్యం లేకుంటే ఏం నష్టం జరుగుతుందో.. ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారని వెల్లడించారు.

బడ్జెట్‌లో ఏపీ, బీహార్‌తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలకు బంగారు పళ్లెంలో వడ్డింపులు జరిగాయని, ఇతర పార్టీలు పాలించే రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు. కేంద్ర ఖజానా నింపుతున్న దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. ఈ వివక్ష సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు.

కేంద్ర రాష్ట్రానికి ఐఐటీ, ఐఐఎం, ఐసర్, ఎన్‌ఐడీ, ట్రిపుల్ ఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ఏదీ ఇవ్వకపోవడం ఇక్కడి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అన్యాయం చేయడమేనని అభిప్రాయపడ్డారు. పునర్విభజన హక్కులను కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడం దుర్మార్గమన్నారు.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ పునరుద్ధరణ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలను అమలు చేయని బీజేపీని ఇకపై రాష్ట్ర ప్రజలు నమ్మరన్నారు. ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆర్థిక సహాయం అందిస్తూ తెలంగాణకు మొండి చూపడం సమంజసం కాదన్నారు.