- మంత్రి జూపల్లి కృష్ణారావు
కామారెడ్డి, జూలై 20 (విజయక్రాంతి): మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చిందని ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. శనివారం కామారెడ్డి జిల్లా బిక్కనూరులో రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు అండగా నిలిచి రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేశారని స్పష్టంచేశారు.
అధికారంలోకి వచ్చిన ౭ నెలల్లోనే ఆరు గ్యారం టీలను అమలు చేశామని పేర్కొన్నారు. ఇంత అభివృద్ధి, సంక్షేమం జరుగుతుంటే ప్రశంసించాల్సింది పోయి, బీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు చేయడంపట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట ప్రజల సొమ్మును కాంట్రాక్టర్లకు దోచి పెట్టిందని ధ్వజమెత్తారు. కమీషన్ల కోసమే కాళేశ్వరాన్ని నిర్మించి ప్రజా ధనాన్ని వృథా చేశారని ధ్వజమెత్తారు.