బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య..
ముషీరాబాద్ (విజయక్రాంతి): ఉద్యోగాల సంఖ్యపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజీ, బీసీ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ముదిరాజ్‌ల అధ్యక్షతన ఏర్పాటు చేసిన నిరుద్యోగుల సదస్సులో ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. నిరుద్యోగుల ఉద్యమాన్ని వక్రీకరిస్తూ రాజకీయ పార్టీలు, నాయకులు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని విమర్శించడం సరికాదన్నారు. డిమాండ్ కాకపోతే వేలాది మంది నిరుద్యోగులు ఎందుకు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
గత 10 ఏండ్లుగా గ్రూప్ స్ధాయి పోస్టులు, గ్రూప్ పోస్టులలో ఎంతమంది రిటైర్డ్ అయ్యారు, ఎంతమందికి ప్రమోషన్‌లు ఇచ్చారో తెలియజేయాలని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ 23 జిల్లాల్లోని వివిధ శాఖల్లో ఏర్పడ్డ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. 25 వేల టీచర్ పోస్టుల భర్తీకి చర్చించాలన్నారు. ఉద్యోగాల భర్తీలో ఆప్షన్ పద్దతి పెట్టడం, వెయిటింగ్ లిస్ట్ పెట్టడం, అన్ని ఫలితాలు ఒకేసారి ప్రకటించడం లాంటి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమస్యపై నిరుద్యోగ నాయకులతో చర్చించి పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా బి. శ్రీనివాస్‌ను ప్రకటించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నంద గోపాల్, సుధాకరన్, పగిళ్ల సతీష్, ఉదయ్ నేత, పృధ్విగౌడ్, నిఖిల్, వెంకటేశ్ గౌడ్, బలరామ్, జక్క నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.