calender_icon.png 3 April, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్ల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే

03-04-2025 01:30:37 AM

ఆర్టికల్ 243 ప్రకారం రాష్ట్రాలకు అధికారం 

కాంగ్రెస్ మేనిఫెస్టోలో బీసీలకు 42% రిజర్వేషన్ల హామీ

ముస్లింలకు లబ్ధి చేకూర్చేలా కాంగ్రెస్ వైఖరి

కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొంతంగా డెడికేషన్ కమిషన్ వేసుకుని చట్ట ప్రకారం బీసీ రిజర్వేషన్లను అమలు చేసుకునే అధికారం ఉందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.

మోదీ సర్కారు ఒప్పుకుంటేనే అమలు చేస్తామని ఆనాడు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. హామీ ఇచ్చేటప్పుడు మోదీ సర్కారును సంప్రదించలేదని పేర్కొన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వంపై నెపాన్ని నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ ముమ్మాటికి వ్యతిరేకిస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణలో 56 శాతానికిపైగా ఉన్న బీసీ జనాభాను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే 46 శాతానికి తగ్గించిందని ఆరోపించారు.

80 శాతానికి పైగా ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి ప్రభుత్వం బీసీల పొట్ట కొడుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ద్వారా ముస్లింలకే లబ్ధి చేకూర్చుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ తీరును చూస్తుంటే ముస్లింల కోసమే బీసీ రిజర్వేషన్లు తెచ్చినట్లు స్పష్టమవుతుందన్నారు. బీసీలకు ఇంతటి ఘోరమైన అన్యాయం జరుగుతుంటే బీసీ సంఘాల నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీసీ సంఘాల తీరును బలహీనవర్గాల ప్రజలతోపాటు తెలంగాణ సమాజమం గమనిస్తుందన్నారు. సమయం వచ్చినప్పుడు సరైన గుణపాఠం చెబుతారని బండి సంజయ్ పేర్కొన్నారు.