07-03-2025 02:02:49 AM
హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ)లో ప్రమాదం జరుగుతుందని.. ముందే తెలిసినా రాష్ట్రప్రభుత్వం నిజం దాచిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ‘ఎక్స్’లో ఆరోపించారు. టన్నెల్ పనులు చేపట్టిన ‘జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్’ 2020లో అంబర్గ్ టెక్ ఏజీ అనే సంస్థతో టన్నెల్ సిస్మిక్ ప్రెడిక్షన్ (టీఎస్పీ) సర్వే చేయించిందని గుర్తుచేశారు.
టన్నెల్‌లోని 13.88 - 13.91 కిలోమీటర్ల మధ్య ఫాల్ట్ జోన్ ఉందని సర్వే సంస్థ గుర్తించిందని తెలిపారు. సొరంగంలో నీటి లీకేజీలు భారీగా ఉన్నాయని నాటి సర్వే రిపోర్టు వెల్లడించిందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదాన్ని 2022లోనే అంచనా వేశారని స్పష్టం చేశారు.
ఇదే ఏడాది జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ జనరల్ మండపల్లి రాజు, జైప్రకాష్ అసోసియేట్స్‌కు చెందిన జియోలజిస్ట్ రితురాజ్ దేశ్‌ముఖ్ మరో సర్వే చేశారని, ఆ సర్వేలో టన్నెల్‌పై ఉన్న భూఉపరితలాన్ని కచ్చితంగా అంచనా వేయకుండానే సొరంగం పనులు మొదలయ్యాయని తేల్చారన్నారు. పనుల కారణంగా వేలాది కోట్ల ప్రజాధనం వృథా కావడమే కాక, ప్రాణనష్టమూ సంభవించే పరిస్థితులు దాపురించాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రెండు నివేదికలనూ రాష్ట్రప్రభుత్వం దాచిపెట్టిందని, నివేదికలపై రాష్ట్రప్ర భుత్వం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని, అలాగే ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి సీఎంతోపాటు మం త్రులు బాధ్యత వహించాలన్నారు.