14-04-2025 11:18:59 PM
వచ్చే నెల 14న జెనీవాలో ఆక్షన్..
న్యూఢిల్లీ: భారత వారసత్వ సంపదలో ఒకటైన 23.24 క్యారెట్ల గోల్కొండ నీలి వజ్రం వేలానికి రంగం సిద్ధమవుతున్నది. స్విట్జర్‌లాండ్‌లోని జెనీవాలో ‘క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యూవెల్స్’ అనే సంస్థ వచ్చే నెల 14న వజ్రాన్ని వేలం వేయనున్నది. ఈ వజ్రం ఒకప్పుడు ఇండోర్, బరోడా సంస్థానాధీశుల సంపదలో ఒక విలువైన ఆభరణం. వేలంలో వజ్రం సుమారు రూ.430 కోట్లు పలికే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో లభ్యం..
నీలపు వజ్రం శతబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కొల్లూరులో లభ్యమైనట్లు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. వజ్రం అనేక పరిణామాల తర్వాత నాటి ఇండోర్ మహారాజు యశ్వంత్‌రావ్ హోల్కర్ భోషాణానికి చేరింది. మహారాజు వజ్రాన్ని ఓ బ్రాస్‌లెట్‌లో పొందుపరిచి చేతికి ఆభరణంగా ధరించేవాడు. తర్వాత వజ్రం ఫ్రెంచ్ చిత్రకారుడు బెర్నాడ్ బౌటెడ్ గీసిన ఓ ఇండోర్ మహారాణి చిత్రంలో ఆమె చేతికి తొడిగిన ఉంగరంలో వజ్రం పొదిగి ఉన్నట్లు కనిపించింది. అనేక పరిణామాల తర్వాత న్యూయార్క్‌కు చెందిన నగల వ్యాపారి హ్యారీ విన్‌స్టన్ ఆ వజ్రాన్ని కొనుగోలు చేసినట్లు తెలిసింది. విన్‌స్టన్ చేతి నుంచి చివరకు తిరిగి భారత్‌కు చెందిన బరోడా సంస్థానానికి వజ్రం చేరుకున్నది. ప్రస్తుతం ఆ వజ్రం ‘క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యూవెల్స్’ అనే సంస్థ చేతికి చిక్కగా, తాజాగా ఆ సంస్థ వజ్రాన్ని వేలం వేసేందుకు సిద్ధమైంది.