- మొదటి దశ పూర్తి చేసిన అధికారులు
- నెలాఖరు నాటికి రెండు, మూడు దశల పూర్తి
- సన్న, చిన్నకారు, పెద్ద రైతుల వివరాల సేకరణ
కామారెడ్డి, డిసెంబర్ 13 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో వ్యవసాయ గణ నకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మొదటి దశ పూర్తి కాగా, రెండు, మూ డు దశల గణనను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.
దేశంలోని ఏయే పంటలు సాగు చేసే రైతులు ఎంతమంది, ఎవరికి ఎంత విస్తీర్ణంలో భూమి ఉందనే విషయాలను తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం ప్రతి ఐదేళ్లకు ఒకసారి వ్యవసాయ గణన చేపడుతుంది. దీనివల్ల రైతులకు కావాల్సిన పథకాల అమలు కోసం నిర్ణయాలు తీసుకోవడానికి వీలుంటుంది. ఇది మూడు దశల్లో కొనసాగుతుంది.
మొదటిది సామాజిక వర్గంగా, రెండోది సన్న, చిన్నకారు రైతుల విస్తీర్ణం పరంగా, మూడో ది స్త్రీ పురుషుల వారీగా గణన చేపట్టనున్నారు. దీని ఆధారంగా దేశంలోని రైతులకు ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో రైతులకు ఏ విధమైన సౌకర్యాలు కల్పించాలి, ఎలాంటి సంక్షేమ పథకాలు అందించాలనే నిర్ణ యం కేంద్రం తీసుకుంటుంది.
ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో గణనను 2024 డిసెంబర్‌లో ప్రారంభించారు. ఇప్పటికే మొదటి దశ గణనను పూర్తి చేశారు. జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో రెండో దశ వ్యవసాయ గణనకు ఎన్యూమరేటర్లుగా ఏఈవోలు, పర్యవేక్షకులుగా మండల ప్రణాళిక, గణాంక అధికారులు వ్యవహరించనున్నారు.
మూడో దశల్లో మండల ప్రణాళిక గణాంక అధికారులు ఎన్యుమరేటర్లుగా, డిప్యూటీ గణాంక అధికారులు పర్యవేక్షకులుగా వ్యవహరించనున్నారు. మండల వ్యవ సాయ అధికారు లు ఇన్‌చార్జిలుగా ఉండనున్నారు. గతంలో దీనిని మాన్యువల్‌గా నిర్వహించారు. ప్రస్తుతం చరవాణితో పాటు ట్యాబ్‌లను వినియోగించి వివరాలు నమోదు చేయనున్నారు. రైతుల వివరాలు నమోదు చేయగా నే నేరుగా సంబంధిత శాఖకు వెళ్తాయి.
రెవెన్యూ గ్రామాల వారీగా..
జిల్లాలో మొత్తం 535 గ్రామాలు ఉండ గా వాటిలో ఎంపిక చేసిన గ్రామాల్లోనే వ్యవసాయ గణన చేయనున్నారు. మొదటి దశ గణనను పూర్తి చేశారు. జిల్లాలోని రెవెన్యూ గ్రామాల వారీగా సన్న, చిన్నకారు, మధ్య తరగతి, పెద్ద రైతుల వివరాలు, వారి సామాజిక వర్గం, వారికి ఉన్న భూముల వివరాల ను సేకరించారు.
జిల్లాలో 20 శాతం రెవె న్యూ గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఉన్న సన్న, చిన్నకారు, పెద్ద రైతు ల భూముల్లో సాగు విస్తీర్ణం, సర్వే నంబర్ల వారిగా వివరాలు, ఆయా భూముల్లో ఏ రకమైన పంటలు పండిస్తున్నారనే వివరాలు సేకరించనున్నారు. మూడోదశ గణనకు జిల్లాలోని 7 శాతం రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేశారు.
ఆయా గ్రామాల్లో రైతులు సాగు చేసి పంటలకు ఉపయోగించిన వివిధ రకాల విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, పరికరాలు, వాటికి అవసరమైన వనరులను ఎక్కడి నుంచి సేకరించారనేది తెలుసుకుంటారు.
31 నాటికి పూర్తి చేస్తాం
జిల్లాలో ఇప్పటికే మొదటి దశ వ్యవసాయ గణనను పూర్తి చేశాం. ప్రస్తుతం రెండు, మూడో దశల్లో గణనను ఈ వారంలో ప్రారంభిస్తాం. ఇప్పటికే వ్యవసాయ అధికారులతో పాటు మండల ప్రణాళిక, గణాంక అధికారులకు శిక్షణ ఇచ్చాం. జిల్లాలో ఎంపిక చేసిన రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 31 నాటికి జిల్లాలో వ్యవసాయ గణనను పూర్తి చేస్తాం.
రాజారం, జిల్లా ప్రణాళిక అధికారి, కామారెడ్డి