- విద్యా క్యాలెండర్ తరహాలో రూపకల్పన
- పాఠశాల స్థాయి నుంచే క్రీడలకు ప్రాధాన్యం
- మట్టిలోని మాణిక్యాలను వెలికితీసేలా ప్రణాళిక
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల వికాసానికి ఎంతో దోహదం చేస్తాయి. క్రీడల ప్రాధాన్యం గుర్తించిన రాష్ట్రప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. విద్యార్థులను పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. దీనిలో భాగంగానే విద్యాక్యాలెండర్ తరహాలో స్పోర్ట్స్ క్యాలెండర్ సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నది. హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) సమావేశంలో ఈ విషయం రూఢీ అయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పోర్ట్స్ క్యాలెండర్‌ను బాధ్యతను ఎస్‌జీఎఫ్ తీసుకోనున్నది.
ఫిజికల్ డైరెక్టర్ల సేవల వినియోగం..
రాష్ట్రవ్యాప్తంగా 26వేలకు పైగా సర్కారు బడులు ఉన్నాయి. వీటిలో 18వేలకు పైగా ప్రాథమిక బడులు, 3,145 ప్రాథమికోన్నత బడులు, 4,701 ఉన్నత పాఠశాలలు. వీటి పరిధిలో మొత్తం 2,956 ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం 2,526 మంది విధుల్లో ఉన్నారు. ఉన్నత పాఠశాలల పరిధిలో ఇప్పటికే 500 మందికి పైగా ఫిజికల్ డైరెక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల రాష్ట్రప్రభుత్వం 1,849 మంది పీఈటీలను ఫిజికల్ డైరెక్టర్లుగా (పీడీ) పదోన్నతి కల్పించింది. దీంతో చాలావరకు ఉన్నత పాఠశాలలకు వ్యాయామ ఉపాధ్యాయుల నియామకం జరిగింది. పీడీలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (పీఈటీ)ల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం స్పోర్ట్ క్యాలెండర్ ఆలోచన చేస్తున్నదని తెలిసింది.
క్యాలెండర్ అమలు ఇలా..
- ఒక విద్యాసంవత్సరంలో నెల వారీగా విద్యార్థులు ఏయే ఆటలు ఆడాలి. క్రీడాకారులకు ఎప్పుడెపుపడు క్రీడా పోటీలు నిర్వహించాలనే ప్రణాళిక స్పోర్ట్స్ క్యాలెండర్‌లో ఉంటుంది.
- ప్రతి ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతుల వరకు చదువుతున్న విద్యార్థులకు రోజుకు ఒక స్పోర్ట్స్ పీరియడ్ ఉంటుంది.
- పాఠశాలల పరిధిలో ఆట స్థలాలు లేనిచోట వెంటనే వాటి ఏర్పాటు. ఆట స్థలాలు ఉంటే, వాటి మరింత అభివృద్ధి.
- అండర్ 14, అండర్ అండర్ 19 క్రీడా పోటీల నిర్వహణ. వాటిలో సత్తాచాటిన వారికి మండల, డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం.
- రాష్ట్రస్థాయిలో రాణించే వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక