కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఎండీ ఇర్ఫాన్ హుస్సేన్.. విద్యార్థి నాయకుడు. చిన్నతనం నుంచే ఉద్యమాల పట్ల, పోరాటల పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో జరిగే ప్రతి సభలో పాల్గొని ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించాడు. అప్పటి వరకు విద్యార్థి నాయకుడుగానే అందరికి పరిచయం. కానీ ఉద్యమ ఊపు అందుకున్న సమయంలో తనలో దాగి ఉన్న కళను వెలికి తీశాడు ఎండీ ఇర్ఫాన్.
ఉద్యమ నేపథ్యంలో ఊరూ ఊరూరా జరిగిన ‘ధూంధాం’ వేడుకల్లో కాళ్లకు గజ్జెకట్టి.. పాటలతో ఎంతమందిని ఆశ్చర్యానికి గురిచేశాడు. అంతేకాదు ఉద్యమసమయంలో ప్రతివేడుకలో పాల్గొని ఉత్సహంగా యువతను చైతన్యపరిచాడు. అలా ఉద్యమ స్ఫూర్తితో ఆడటం.. పాడటం ప్రారంభించాడు. అలాగే ఉద్యమ పాటలు రాస్తూ.. అందరి మన్నన్నలు పొందాడు. అలా చిన్నవయసులోనే కళాకారుడిగా రాణించాడు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పనిచేశాడు.
తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించేవరకు తనవంతుగా బాధ్యతలు నిర్వహించాడు. వయసు లో చిన్నవాడు అయినప్పటికీ కళాకారుడిగా ఉద్యమ స్ఫూర్తిని మాత్రం విడిచిపెట్టలేదు. ఉద్యమంలో కీలకంగా పని చేయడం వల్ల ఉద్యమ సమయంలో కేసుల సైతం నమోదు అయ్యాయి. కేసులకు భయపడకుండా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించేవరకు ఉద్యమపోరును ఏమాత్రం తగ్గించలేదు ఎండీ ఇర్ఫాన్ హుస్సేన్.
తెలంగాణ రాష్ట్రం ప్రకటించాక.. అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కళాకారులకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ‘తెలంగాణ సాంస్కృతిక సారధి’ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రత్యేక చొరవ తీసుకోని ఎండీ ఇర్ఫాన్‌కు తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఉపాధి అవకాశం కల్పించారు. దీంతో ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తోటి కళాకారులతో కలసి అవగాహన కల్పించారు.
కొన్ని రోజుల తరువాత ఆయన తెలంగాణ సాంస్కృతిక సారధి నుంచి బయటకు వచ్చి.. జర్నలిస్టుగా కూడా పని చేశారు. ఆ తర్వాత 2023 ఎన్నికల సమయంలో పార్టీ పిలుపు మేరకు బీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు. అలా పార్టీ సమావేశాలు, సభల్లో గళం విప్పి ప్రజలను చైతన్యపరచడం మాత్రం ఆపలేదు.
అమరుల ఆశయాలను మార్చిపోవద్దు..
ఉద్యమ స్ఫూర్తితోనే నా గళం విప్పి, కాళ్లకు గజ్జె కట్టిన. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై ధూంధాం పాటలతో.. ఆటలతో ప్రజలను చైతన్యపరచడం నా అదృష్టంగా భావిస్తున్నా. నాకు విద్యార్థి దశ నుంచి పోరాట లక్షణాలు ఉండేవి. ఉద్యమ సమయంలో మరింత ఉత్సహంగా పాల్గొన్నా. తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారు. ఆ అమరుల త్యాగాలను తెలంగాణ సమాజం ఎప్పటికీ మార్చిపోవద్దు. వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగడం ప్రభుత్వాల బాధ్యతగా కూడా.
-ఎండీ ఇర్ఫాన్ హుస్సేన్
ఆసిఫాబాద్, విజయక్రాంతి