మన దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య ‘నిరుద్యోగం’. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేయ టం వల్ల అన్ని రకాల సామర్థ్యాలు ఉన్నవారికి కూడా సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకడం లేదు. కారణాలేవైనా, నిరుద్యోగం కేంద్ర ప్రభుత్వాలకు, కోట్లాది మంది యువత కుటుంబసభ్యులకు పెనుసవాలుగా మారింది. ‘ది సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ (పీయమ్‌ఐఈ) గణాంకాల ప్రకారం గత నాలుగు నెలల కాలంలోనే నిరుద్యోగ రేటు 7 నుంచి 9.2 శాతానికి పెరిగినట్లు తెలుస్తున్నది. ఇటీవల ప్రధానమంత్రి ‘గత నాలుగేళ్లలో 8 కోట్ల మందికి ఉద్యో గాలు కల్పించినట్లు’ ప్రకటించారు. ఇందులో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అయినప్పటికీ రోజురోజుకూ నిరుద్యోగం పెరుగుతున్నది.
విచిత్రం ఏమిటంటే, ఏ నివేదికలు భారతదేశం లోని నిరుద్యోగ స్థితిగతులపై స్పష్టమైన లెక్కల ను చెప్పలేకపోతున్నాయి. పీయల్‌ఎఫ్‌యస్ (పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే), సీయమ్‌ఐఈ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ), ఏయస్‌యుయస్‌ఈ (యాన్యు వల్ సర్వే ఆన్ అనిన్‌కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్), కేయల్‌ఈయమ్‌యస్ (క్యాపిటల్, లేబర్, ఎనర్జీ, మెటీరియల్స్ సర్వీసెస్), ఆర్‌బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), యస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వంటి సంస్థలు నిరుద్యోగంపై నివేదికలు ప్రకటిస్తున్నా, ఒకదానితో ఒకటి సరితూగటం లేదు. దీనికి ప్రధాన కారణం 2021 నుంచి దేశవ్యాప్తంగా ‘జనగణన’ (సెన్సస్) చేయక పోవడమే.
మరోవైపు గత నాలుగు దశా బ్దాలుగా ఎన్నడూ లేని విధంగా మన దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు కనపడుతున్నాయి. 2016లో పెద్ద నోట్ల రద్దు, 2017 జులైనుంచి అమల్లోకి వచ్చిన జీయస్‌టీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల సంక్షో భాలు, కోవిడ్ ప్రభావం వంటివి. 2024 ఫిబ్రవరి నెలలో ఉత్తరప్రదేశ్‌లో 60 వేల పోలీసు ఉద్యోగాలకు 47 లక్షలమంది, 2022లో బీహార్‌లో రైల్వేలో నాన్‌టెక్నికల్ ఉద్యోగాలకు 1 కోటి 25 లక్షలమంది పోటి పడ్డారు. దేశంలో నిరుద్యోగం ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతున్నది. ఇకనైనా ప్రభుత్వాలు నిరు ద్యోగ పరిష్కారానికి సీరియస్‌గా దృష్టి సారించాలి.
ఐ.ప్రసాదరావు