- ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సింగిల్ జడ్జి తీర్పు రద్దు
- రాజ్యాంగమే సుప్రీం
- సరైన సమయంలో తేల్చాలి
- స్పీకర్‌కు సూచించిన హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందుంచాలని, వాటి ఆధారంగా నాలుగు వారాల్లో షెడ్యూల్ నిర్ణయించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును శుక్రవారం హైకోర్టు రద్దు చేసింది.
అయితే అనర్హత పిటిషన్లపై సరైన సమయంలో తేల్చాలని స్పీకర్‌కు శుక్రవారం హైకోర్టు స్పష్టంచేసింది. సరైన సమయాన్ని నిర్ణయించే ముందు ఇప్పటికే అనర్హత పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న కాలా న్ని, పదో షెడ్యూలు లక్ష్యాలను, అసెంబ్లీ కాలపరిమితిని దృష్టిలో ఉంచుకోవాలని ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరంలేదని పేర్కొంటూ తీర్పు వెలువరించింది.
అనర్హత పిటిషన్లు దాఖలు చేసి నాలుగున్నర నెలల సమయం గడిచిపోయిందని, నిబంధనలకు లోబడి అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగం సుప్రీం అని, రాజ్యాంగ అత్యున్నత స్థానంలో ఉన్న స్పీకర్‌కే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం ఉందని తెలిపింది.
అయితే ఆ నిర్ణయంపై న్యాయసమీక్ష అధికారం కోర్టులకు ఉందని తెలిపింది. ప్రస్తుత పిటిషన్లపై సకాలంలో నిర్ణయం వెలువరించాలని, దీనికి ఇప్పటికే పెం డింగ్‌లో ఉన్న సమయం, అసెంబ్లీ కాలపరమితి అన్ని అంశాలను పరిగణనలోకి తీసు కుని సరైన సమయంలో తేల్చాలని స్పీకర్‌కు స్పష్టం చేస్తూ 78 పేజీల తీర్పు వెలువరించింది.
బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ తర్వాత కాంగ్రెస్‌లో చేరడంతో వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానందలు పిటిషన్లు దాఖలు చేశారు. వీటితోపాటు దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు.
అనర్హత పిటిషన్లను స్పీకర్ స్వీకరించకపోవడంతో వీరు హైకోర్టును ఆశ్రయించగా, వీటిపై విచారించిన సింగిల్ జడ్జి నాలుగు వారాల్లో అనర్హత పిటిషన్లపై షెడ్యూలు ఖరారు చేయాలంటూ సెప్టెంబరు 9న తీర్పు వెలువరించారు. వీటిని సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు.
వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి ఈనెల 12న తీర్పు రిజర్వు చేసి శుక్రవారం వెలువరించింది. అనర్హత పిటిషన్లకు సంబంధించి సుప్రీం కోర్టు వెలువరించిన పలు తీర్పులను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం అమలులో ఉన్న తీర్పులనే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది.
కిహొటో హోలోహాన్, రాజేంద్రసింగ్ రాణా, కేశం మెగాచంద్రసింగ్ కేసులతోపాటు సుభాష్ దేశాయ్ కేసులో రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పులను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిపిం ది. కిహొటో హోలోహాన్ కేసులో రాజ్యాంగంలోని 10వ షెడ్యూలులోని అంశాలను ధ్రువీకరించిందని, స్పీకర్ నిర్ణయం తీసుకోకముందు కోర్టుల జోక్యం చేసుకోరాదని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిందని పేర్కొంది.
అనర్హత పిటిషన్ల విచారణ సందర్భంగా ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడం ద్వారా తీవ్రపరిణామాలు తలెత్తినపుడు మాత్రమే జోక్యం చేసుకోవచ్చని పేర్కొందని తెలిపింది. అయితే ఇదే కేసులో అధికరణ 136, 226, 227 కింద సుప్రీం, హైకోర్టుల జోక్యాన్ని పూర్తిగా నిషేధించలేదని, పరిధికి సంబంధించిన అంశాల్లోనే పరిమితులను పేర్కొందని తెలిపింది.
రాజ్యాంగ ఉల్లంఘనలు, దురుద్దేశాలు, సహజ న్యాయసూత్రాలకు విరు ద్ధంగా ఉన్నపుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చని ఈ తీర్పు స్పష్టం చేసిందని తెలిపింది. రాజేంద్ర సింగ్ రాణా కేసులో పార్టీ చీలిక, విలీనం తేలేదాకా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేదాకా వాయిదా వేయడాన్ని కిహిటో హోలోహాన్ కేసు ఆధారంగా జోక్యం చేసుకుని స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు రద్దు చేస్తున్నట్లు పేర్కొందని తెలిపింది.
అయితే రాజేంద్రసింగ్ రాణా కేసులో అధికరణ 226 కింద న్యాయసమీక్ష చేయవచ్చా లేదా అని తేల్చలేదని, అనర్హత పిటిషన్లపై సకాలంలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చని పేర్కొందని తెలిపింది.
ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం కేశం మెగాచంద్రసింగ్ వర్సెస్ మణిపూర్ స్పీకర్ కేసులో నాలుగు వారాల్లో అనర్హత పిటిషన్లపై తేల్చాలంటూ ఆదేశాలు జారీచేసిందని, న్యాయసమీక్షకు ఈ తీర్పును పరిగణనలోకి తీసుకోలేమని తెలిపింది.. తాజాగా సుప్రీం కోర్టు వెలువరించిన సుభాష్ దేశాయ్ కేసులో అనర్హత పిటిషన్లపై సహేతుక సమయంలో స్పీకర్ తేల్చాల్సి ఉందని పేర్కొందని తెలిపింది.
సుభాష్ దేశాయ్ కేసులో నిర్ణయం వెలువరించే ముందు రాజేంద్రసింగ్ రాణా, కేశం మెగాచంద్ర సింగ్ కేసులను పరిగణనలోకి తీసుకునే సహేతుక సమయంలో స్పీకర్ అనర్హత పిటిషన్లపై తేల్చాలని తీర్పు వెలువరించిందని తెలిపింది. ఈ తీర్పులన్నింటినీ పరిశీలిస్తే 10వ షెడ్యూలు కింద అనర్హత పిటిషన్లపై తేల్చే అధికారం స్పీకర్‌కు ఉందని స్పష్టమవుతోందని పేర్కొంది.
రాజ్యాంగ అత్యున్నత పదవిలో స్పీకర్ ఉంటారని, సమాజం చట్టానికి లోబడి ఉంటుందని, రాజ్యాంగమే సుప్రీం.. పదో షెడ్యూలు ప్రకారం స్పీకర్ తన అధికారాలను వినియోగిస్తారని తెలిపింది. అదే సమయంలో స్పీకర్ నిర్ణయం కిహొటో హోలోహాన్, రాజేంద్రసింగ్ రాణా, సుభాష్ దేశాయ్ కేసుల ప్రకారం న్యాయసమీక్షకు లోబడి ఉంటుందని పేర్కొంది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సహేతుకమైన సమయంలో తేల్చాల్సింది ఉందని పేర్కొంది.
వాదనలు..
‘స్పీకర్ తన ముందున్న పిటిషన్లపై నిర్ణయం వెలువరించిన తర్వాత కోర్టులు న్యాయ సమీక్ష జరపొచ్చు. అయితే అది కూడా చాలా స్వల్పమే. కానీ, స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోక ముందు కోర్టులు ఆయనపై ఒత్తిడి తేలేవు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రాజ్యాంగ అధిపతి అయిన స్పీకర్ విధుల్లో కోర్టుల జోక్యం అతి స్వల్పం. అడ్మినిస్ట్రేటీవ్, లెజిస్లేటీవ్, ట్రిబ్యునల్ చైర్మన్‌గా.. ఇలా స్పీకర్ పలు కీలక విధులు నిర్వహిస్తారు.
స్పీకర్ ముందున్న అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం, స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది. తన వద్దకు వచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ రాజ్యాంగం స్పీకర్‌కు ఇచ్చింది’అని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున రవీంద్ర శ్రీవాస్తవ, ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి, జంద్యాల రవిశంకర్ వాదించారు.
‘పదవ షెడ్యూల్‌ను ఉల్లంఘించిన వ్యక్తులను అనర్హులుగా ప్రకటించాలనే రాజ్యాంగ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో స్పీకర్ ముందు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి.
శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపుల అంశంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీళ్లు దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదు’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది, బీజేపీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.