ఒక వస్తువుకు, వ్యక్తికి, సంఘటనకు, అభిప్రాయానికి సంబంధించిన జ్ఞానా కృతి ‘అర్థం’. అర్థంతో (స్వీ య ఇష్టాయిష్టాలతో, లాభనష్ట భావాలతో, అహంకార మమకారాలతో) ఏర్పడే మూల్యాంకనం ‘అభిప్రా యం’. అర్థం అవగాహనను ఏర్పరిస్తే అభిప్రాయం స్పం దనా దిశను నియంత్రిస్తుంది. దేని గురించైనా యధార్థంగా, స్పష్టంగా అర్థం కావాలంటే అందుకు కావలసినవి తగిన భాషాజ్ఞానం, సంస్కారం 3. శ్రద్ధ 4. ఆధారం. ఒక విషయాన్ని గురించి మనకు అందే అర్థం ఆధారాన్ని, సాధనను, శ్రద్ధా సంస్కారాలనుబట్టి మారుతూ ఉంటుంది. మన అనుభవం, పూర్వాభిప్రాయాలతో ప్రబలంగా ప్రభావితం అవుతుంది. అర్థం వికాసమే అవగాహన. వస్తువు నామరూప గుణాలను గురించి ఏర్పడిన స్పృహ అర్థం. జీవన వ్యవస్థలో దాని స్థానాన్ని గురించిన యెరుక అవగాహన. వ్యక్తిగత అహంకార మమకారాల నిర్మితినిబట్టి అవగాహన తీసుకునే స్పందనా దిశయే అభిప్రాయం. మౌలికంగా అదే మూల్యాంకనం.
మన త్రికరణాలు వెలయించే ప్రతి చర్యకూడా ఒకానొక మూల్యాంకనమే. సగటు మనిషి నిత్య జీవితంలో అర్థం, అవగాహన, అభిప్రాయం పరస్పర ప్రభావాలకు లోనయ్యేవే. అయితే, పరిణతి చెందిన బుద్ధిజీవులు, కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వహించే అధికారులు సత్యాన్ని గ్రహించి, సమస్యలను పరిష్కరించే సందర్భంలో విషయాన్ని అర్థం చేసుకునేటపుడు, ఒక అవగాహన ఏర్పరుచుకునేటపుడు పూర్వాభిప్రాయాలకు తావివ్వరు. అదే శాస్త్రీయమైన, వస్తుగతమైన అవగాహన. తద్వారా కార్యకారణ సంబంధాలు ఇష్టానుసారంగా మార్చబడవు. ఫలితంగా వారు సమస్యను పరిష్కరించడంలో సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ విశిష్ట విజ్ఞతే మనీషత్వం.
ఎక్కడైతే రాజనీతి, పరిపాలన, విద్య, వైద్యం, న్యాయం వంటి కీలక రంగాలలో ఈ మనీషత్వం ప్రబలంగా ప్రవర్తిల్లుతుందో ఆ సమాజం సదా సుఖశాంతులతో ప్రవర్ధిల్లుతుంది. ఏ సమాజంలో అయితే ఉన్నత స్థానా ల్లో మనీషత్వం క్షీణిస్తుందో, అక్కడ అసత్యం, నటన, ధర్మచ్యుతి, ఆర్థిక అసమానతలు, సగటు చౌకబారుతనం, పటాటోపం, ఓర్వలేనితనం రాజ్యమేలుతాయి. ఎప్పుడైనా సమాజంలో దారి తప్పిన అవగాహనను, అభిప్రాయాలను సంస్కరించగలిగింది, సంస్కరించవలసింది గురువీర ప్రకాశమే!
యముగంటి ప్రభాకర్
9440152258