31-01-2025 12:00:00 AM
శ్రీహరికోటలోని షార్‌నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్-15 వాహక నౌకద్వారా ఇటీవల ఇస్రో జరిపిన వందో ప్రయోగం విజయవంతమవడం అద్భుతమేకాక అభినందనీయం. మన అంతరిక్ష విజయాలలో ఇది మరో మైలురాయి. 2,250 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం ‘స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ’.
వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ వంటి వాటిలో పది సంవత్సరాలు ఈ వ్యవస్థ మనకు సేవలు అందిస్తుంది. మన దేశం సరిహద్దుల ఆవల సుమారు 1,500 కి.మీ. పరిధి వరకు ఇది పనిచేస్తుంది.
అనేక ఘన విజయాలతో ఇస్రో అగ్రరాజ్యాలకు దీటుగా మన సత్తాను చాటుతున్నది. భవిష్యత్తులో స్పేస్ స్టేషన్, చంద్రయాన్- శుక్రయాన్, గగనయాన్ తదితర ప్రాజెక్టుల విజయానికి సంస్థ నాంది పలికింది. 2024 డిసెంబర్ 30న చేపట్టిన ‘స్పేడెక్స్ ప్రయోగాన్ని’ కూడా మన శాస్త్రవేత్తలు దశల వారీగా విజయవంతం చేశారు.
కీలకమైన ఎస్‌డీఎక్స్ 01(ఛేజర్), ఎస్‌డీఎక్స్ 02 (టార్గెట్) ఉపగ్రహాలను అంతరిక్షంలో అనుసంధానం చేసే దశను మనం దాటేశాం. ఈ డాకింగ్ ప్రక్రియ కో సం సెన్సర్ల సాయంతో మూడుసార్లు ప్రయత్నించి, పరిస్థితులు అనుకూలించక చివరలో విరమించుకోవాల్సి వచ్చింది.
వృత్తాకార కక్ష్యలో భూమిచుట్టూ గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఉపగ్రహాలను వాటి వేగాన్ని నియంత్రిస్తూ, బాగా తగ్గించి, చివరికి 3 మీటర్ల దూరం వచ్చాక చాలా జాగ్రత్తగా డాకింగ్ ప్రక్రియ అమలు జరిపి, ఒకే యూనిట్‌గా మార్చడం చాలా చాలా కష్టం. అయినా, ఇస్రో శాస్త్రవేత్తలు తొలి ప్రయోగంతోనే దాన్ని సాధించి నవ చరిత్ర సృష్టించారు.
ఇప్పుడు అనుసంధానమైన శాటిలైట్ల మధ్య విద్యుత్ ప్రసారం చేసి స్పేస్‌లో ఉపగ్రహాల నడుమ సర్వీసింగ్‌ను పరిశీలిస్తారు. ప్రయోగాలు పూర్తయ్యాక అన్ డాకింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు. ఈ రెండు ఉపగ్రహాలు రెండేళ్లపాటు సేవలు అందించనున్నాయి.
ఈ అసాధారణ విజయంతో మన అంతరిక్ష ప్రయోగాల జోరు ప్రపంచ స్థాయిలో ప్రముఖ వార్త అయ్యింది. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం 3,984 కోట్లతో శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మించాలని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. ఇప్పటికే విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి విజయవంతంగా ప్రవేశపెడుతూ అంతరిక్ష వాణిజ్య రంగంలో దూసుకుపోతున్న భారతదేశం త్వరలోనే మరింత మెరుగైన ప్రయోగ ఫలితాలతో దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకం కాగలదనడంలో సందేహం లేదు.
ఆరు దశాబ్దాల అనంత కృషి
1962లో ‘ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసర్చి’ (INCOSPAR)గా ఆరంభమైన సంస్థ 1969లో ‘ఇస్రో’గా రూపాంతరం చెందింది. 1975 ఏప్రిల్ 19న ‘ఆర్యభట్ట’తో అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టాం. ఇప్పటికి 548 ఉపగ్రహాలను రోదసిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగాం. రాబోయే ఐదేళ్ళలో మరో 200 ప్రయోగాల మార్కును అందుకుంటామని ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ చేసిన ప్రకటన మనదైన లక్ష్యాన్ని చాటుతున్నది.
సైకిల్‌పై, ఎడ్లబండ్లపై రాకెట్ల విడిభాగాలను మోసుకెళ్ళిన స్థాయినుంచి ఒకే ప్రయోగంతో వంద ఉపగ్రహాలకు పైగా విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించే స్థాయికి ఇవాళ భారత్ అంతరిక్ష రంగంలో అభివృద్ధి చెందింది. కీలకమైన అంగారక గ్రహంపై జీవరాశి మనుగడ అంశాన్ని శోధించే స్థితికి చేరుకున్నాం.
తొలి ప్రయత్నంలో నిలబడ లేని విక్రమ్ ల్యాండర్ అపజయంపై నాలుగు సంవత్సరాలు పెద్ద సంగ్రామమే చేసి పోగొట్టుకున్నచోటే నిలబడగలిగాం. చంద్రుని ఉపరితలంపై విక్రమ్ సాక్షిగా ప్రజ్ఞాన్ రోవర్‌తో చారిత్రాత్మక అడుగులు వేయించాం.
ఇంకా, శుక్రయాన్‌కు సిద్ధమవుతున్నాం. అంతరిక్ష వ్యవసాయం కోసం అన్వేషిస్తున్నాం. మానవ సహిత రోదసీ యాత్రలవైపు ఉత్సాహంగా సంసిద్ధమవుతున్నాం. సూర్యుని ఉపరితల శోధనలో మనదైన పరిజ్ఞానపు పరిధిని పెంచుకుంటున్నాం.
ఫిజిక్స్ అరుణ్ కుమార్