calender_icon.png 16 January, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పక్షుల రెక్కల రెపరెపలో జ్ఞానధ్వని

22-12-2024 12:50:30 AM

మాడభూషి శ్రీధర్ :

కీశు కీశెన్ఱు= కీచుకీచుమని, ఎంగుం= అంతటనూ, ఆనైచ్చాత్తన్= భారద్వాజ పక్షులు, కలందు= ఒకొరకరు కలిసి, పేశిన=మాట్లాడిన, పేచ్చు అరవం= మాటల ధ్వని, కేట్టిలైయో= వినలేదూ, పేయ్ ప్పెణ్ణే= ఓసి పిచ్చిదానా, కాశుం=బొట్టు, పిఱప్పుం= మంగళసూత్రం, కలకలప్ప= గలగలమని చప్పుడు చేస్తూ, క్కై పేర్ త్తు= చేతులు కదిలిస్తూ, వాశం= వీచుచున్న, నఱుం= మంచి పరిమళం, కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్= కవ్వముతో, ఓ శై పడుత్త= ధ్వని వచ్చేట్టుగా చిలుకుతుంటే, తయిర్ అరవం= పెరుగు ధ్వనిని, కేట్టిలైయో= వినడం లేదూ, నాయగ ప్పెణ్ పిళ్ళాయ్!= ఓ నాయకురాలా, నారాయణన్= ఆశ్రయించిన వారిని కాపాడాలనే ప్రేమతో అంతగా వ్యాపించిన వాడు, మూర్ త్తి= కృష్ణరూపంలో మనముందున్న వాడు, కేశవనై= కేశవుడనే రాక్షసుని చంపిన వాడు, ప్పాడవుం= కీర్తిస్తూ ఉంటే, నీ= నీవు, కేట్టే కిడత్తియో= వినికూడా పరున్నావా, తేశం ఉడైయాయ్!= ఓ తేజశ్శాలీ, తిఱ= తలుపు తెఱువు తల్లీ, లోర్ ఎమ్బావాయ్.

ఆరో పాశురం నుంచి పదిమంది గోపికలను పదిమంది వైష్ణవ ఆళ్వారులకు ప్రతీకగా నిదుర లేపుతూ ఆ ఆళ్వారులను అనుష్ఠానం చేయమని ఉద్బోధిస్తుంటారు గోదమ్మ. నిన్న పుళ్లుమ్ పాశురంలో తన తండ్రి పెరియాళ్వార్‌ను మేల్కొలిపి ఈరోజు కులశేఖరాళ్వారుకు సుప్రభాతం పాడుతున్నారు. నిన్న అస్మద్గురుభ్యోన్నమః, ఈ రోజు అస్మత్పరమ గురు భ్యోన్నమః  అని ఎవరికి వారు తమ గురువులను సంస్మరించుకోవాలి. 

గోదాదేవి మహా కవయిత్రి. శెన్ తమిళ్ అంటే అందమైన తమిళ భాషలో భక్తి, భగవత్కీర్తన, ఆచార్య వైశిష్ఠ్యం, భాగవత కథలు, రామాయణ ప్రస్తావన కలగలిపి ఓ ఎనిమిది పంక్తులలో కుదించి, గేయంతో  అలరించడం ఎవరికి సాధ్యం. కేశవుని కీర్తన విని మనసు తెరవమని బోధిస్తున్నది. 

హైదరాబాద్ కేశవగిరి చంద్రాయణగుట్టలో ఆనాటి ప్రధానార్చకులు జగన్నాథాచా ర్యులు ‘రంగ రంగా శ్రీరంగా’ అంటూ నిద్ర లేస్తారు. వేంకటేశ్వరాలయంలో తాంబూర శృతి చేసుకుని మైకు సరిచేసుకుని వేంకట నరసింహాచార్య సుప్రభాత పద్యాలు చెప్పేవారు. 

శ్రవణం ప్రధానం. శ్రవణ భక్తి ప్రథమం. జ్ఞాన సముపార్జన శ్రవణంతో మొదలవుతుంది. శబ్దం వినడంతో కావలసిన స్ఫూర్తి లభిస్తుంది. మొదటి గుర్తు పక్షుల కిలకిలారావములు, రెండోది శంఖనాదము, మూడు- లేవగానే మునులు యోగులు పలికే ‘హరి హరి హరీ’ అనే మాటలు. పక్షుల ధ్వనులు కేవలం ధ్వనులే. అర్థాలు ఉన్నాయో లేదో తెలియదు. కాని, తెల్లవారిందనే సందేశం ఇచ్చి నిద్ర లేపడానికి ఉపకరిస్తాయి.

మనకన్నా ముందే లేచి మనకు లేచే వేళయిందని చెప్పి మనలను లేపే మహోపకారం చేస్తున్నాయి పక్షులు. వారే జ్ఞానులు. అన్నమయ్య నారాయణుడు ఆధారమైన వాడు. సులుభుడు. జ్ఞానయజ్ఞ మీగతి మోక్షసాధనం నానార్థాలు నిన్నే నడపె మాగురుఁడు... కేశవుని నిరంతరం కీర్తించతగిన వాడు. భారద్వాజ పక్షులను పలుకులనే వేదాలుగా చెప్పుకుంటున్నారు.  

తిరుప్పావై సిరినోము 

కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు

పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే

కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు

వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్

ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో

నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి

కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో

తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్ (తమిళ)

గోదా గోవింద గీతం

అదిగో వినలేదా కీచుకీచు పిట్టల కిలకిలారావములు

భారద్వాజ పక్షుల మధుర సంభాషణలా నిక్వణాలు

కుండలలో చిక్కగా నిండిన మజ్జిగల చర్రు చర్రున 

నిలువెత్తు కవ్వాల యవ్వనులు చిలుకు సవ్వడులు

ఊగెడు గోపికల కేశాల రాలిన పూలవాసనాలు తాకలేద

వగలు నగలు నగవులు కలిసి దీపించు వెల్గులు చేరలేద

పీతాంబరుని వేడక ఈ పిచ్చినిదురేలనే పిచ్చిపిల్ల 

మనము తెరచి మాధవుడినె తలచెదము తనివిదీర (తెలుగు)