26-04-2025 01:24:01 AM
పాకిస్థాన్ ముర్దాబాద్
హిందుస్థాన్ జిందాబాద్
నినదిస్తున్న భారత్
ఒక్కదెబ్బతో పాక్‌ను ముక్కలు చేయండి
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయ క్రాంతి): మాజీ ప్రధాని ఇందిరాగాంధీని స్ఫూర్తితో ఉగ్రమూకలకు గట్టి సమాధానమివ్వాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కోట్లాది భారతీయులందరూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటారని, పాకిస్థాన్‌ను రెండు ముక్కలుగా చేయాలని కోరారు.
1967, 1971 సంవత్సరాల్లో ఇలాం టి దాడులు జరిగినప్పుడు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారని, ఒక్క దెబ్బతో పాకిస్థాన్‌ను పాక్, బంగ్లాదేశ్‌గా రెండు ముక్కలు చేశారని గుర్తుచేశారు. ఈ సందర్భంలో ఇందిరాగాంధీని వాజ్‌పేయ్ దుర్గామాతతో పోల్చినట్టు గుర్తుచేశారు. ప్రధాని మోదీ దుర్గామాత భక్తులుగా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి, ప్రధాని మోదీకి అండగా నిలబడుతోందని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించింది. ఈ ర్యాలీ పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై నెక్లెస్‌రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది.
సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. క్యాండిల్ ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పహల్గాంలో భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతీ చర్యకు మద్దతు పలికేందుకు అందరం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
తీవ్రవాదాన్ని అంతమొదించి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రజలందరూ అండగా నిలబడి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరారు.