calender_icon.png 22 November, 2024 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైతన్యశక్తియే ఆత్మ!

22-11-2024 12:00:00 AM

‘ఆత్మ ఎక్కడ ఉన్నదని వెదుకులాడవలసిన పని లేదు. ఉన్నదంతా ఆత్మే’ అని గ్రహించండి. ప్రశ్నల్లా, ‘మనిషి దేహంలో ఆత్మ ఎక్కడ ఉన్నది?’ అని ప్రశ్నించుకోవడంతో ఆత్మ విచారణ, ఆత్మానుభూతికై సాధన తీవ్రతరమవుతుంది. ఆత్మ నిత్యం, సత్యం, కాలాద్య విచ్ఛిన్నం, అపరిమేయం. అది పరిణామానికి లోనుకాని శక్తిమూలం. ఆత్మ ఆకాశం వలే శూన్యం! గగనం వలె సం పూర్ణం. ‘ఆత్’ అంటే ‘ఏమీ’, ‘మా’ అంటే ‘లేదు’ అని అర్థం.

అంటే ప్రత్యేకంగా లేదని, ఉన్నదంతా అదేనని అసలు అర్థం. ప్రాణశక్తికి, ఇంద్రియ చలనాలకు కరచరణాది అవయవాల కదలికలకు, మెదలికలకు, సర్వ కార్యకలాపాలకు మూలం ఆత్మే!

పంచభూతాలూ, ప్రాణం, ఆహారం, బుద్ధివంటి సమస్త పదార్థమూ ఆత్మ నుంచి పుట్టినవే!

హృదయమనే ఖాళీ గుహ, మనిషి కుడి రొమ్మున ఉన్నది. అందులో ‘నేను, నేను’ అంటూ నిస్వనంగా, నిరంతరంగా, అఖండంగా, వాఙ్మయంగా, జ్యోతిర్మయంగా, ఆత్మ వెలుగుతూనే ఉన్నది. వెలుగులీనుతూనే ఉన్నది.

కాలిగోటి నుంచీ తలవెంట్రుక చివరి కొస వరకు ఆత్మే చైతన్యశక్తిగా శరీరాన్ని నడిపిస్తున్నది. అంగాంగీభావంతో, మనిషి తన దేహాన్ని శాశ్వత వస్తువుగా భావిస్తాడు. అవిద్య, అజ్ఞానం, అనాచారం, అస్పష్టత వంటి వ్యతిరిక్త శక్తుల వల్ల దేహం చుట్టూ తన ఆలోచనలను ఒక వలయంగా గూడు కట్టిస్తాడు. అందువల్లనే తాను ఆత్మనన్న భావన నుంచి బహుదూరంగా వైదొలగుతుంటాడు.

ఈ బహిరంగ వలయం నుంచీ మనిషి తన లోపలికి తాను తొంగి చూసుకోవటం ప్రారంభించటంతో ఆత్మానుభూతికి దారి దొరుకుతుంది. ధ్యానం ద్వారా, ఆత్మానుభూతిని పొందినప్పుడు ఉనికి, అస్తిత్వం, అహం నశించి ఆత్మప్రకాశం అనుభవమవుతుంది. ఈ స్థితిలో మరణ భయం నశించి అమరత్వ సిద్ధి కలుగుతుంది. తన శాశ్వతత్వం ఎరుకగా అనుభవంలోకి వచ్చినప్పుడు, సదానందుడై పరమానందాన్ని తన సహజస్థితిగా అనుభవిస్తూ అచలుడై, శుద్ధాద్వైతంలో నిలకడ చెందుతాడు.

మరణమంటే మార్పేనన్న భావన స్థిరమై మృత్యువును ఆహ్వానించడు! అలాగే, కలకాలం ఉండాలని ఆశించడు!! ఇదొక అద్భుత స్థితి; ఇదే ఆత్మానుభూతి కలిగించే మహానంద స్థితి. ఇప్పటి దాకా జరిగిన విచారణంతా ఆత్మ విద్యలో భాగమే! ఆత్మానుభూతిని వేరెవ్వరూ కలిగించలేరు. ఎవరికి వారు తమ స్వీయసాధన ద్వారా పొందాలి. అంతరంగ సాధన ద్వారా మనిషి తన జన్మను పారమార్థికంగా సార్థకం చేసుకోవాలి. జిజ్ఞాస ద్వారా సత్యాన్వేషణ కొనసాగించాలి.

ఆత్మ, ఆత్మవిచారణ, ఆత్మానుభూతి వంటి ఉదాత్త విషయాలను ఏకాగ్రచిత్తంతో, స్వానుభవంతో అర్థం చేసుకో వాలి, అనుభవించాలి...” పిప్పలాద మహర్షి తనను సమీపించి ప్రశ్నించిన జిజ్ఞాసువులకు ఆత్మవిద్యా వరదానం చేసి, మంగళాశాసనం చేశారు!

జిజ్ఞాసువులందరూ సభక్తికంగా, పరమ ఋషిసత్తముడికి ప్రణామ సహస్రం సమర్పించి, సంపూర్ణ సమాధానా లను పొంది, ఆత్మనిష్ఠులైనారు! ఒక మహర్షీ కొందరు జిజ్ఞాసువుల మధ్య సాగిన ప్రశ్నోత్తర సమాధానమే ‘ప్రశ్నోపనిషత్’గా మానవజాతికి లభించింది.

- వి.యస్.ఆర్.మూర్తి