బ్రహ్మమును ఎరిగిన వాడు బ్రహ్మమే అవుతాడు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞాన మయ ఆనందమయ కోశాలు పంచకోశాలుగా మానవ దేహంలో ఉన్నయ్. వీట న్నిటి అవతల ఆత్మ ప్రకాశమానంగా ఉన్న ది. వాక్కుకి, మనసుకి అంత తేలికగా అం దని పరమాత్మ అక్కడే ఉన్నాడు. మనుష్యానందం నుంచీ బ్రహ్మానందం వైపు మనిషి తన ప్రస్థానం కొనసాగించాలి.
అన్ని కోశాలను ఆక్రమించి, ఆదరించి, ఆవహించి ఆనందం నిండి ఉన్నది. ఆ స్ఫు రణను కలిగిస్తూ విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశానికి ముందే ఉన్నది. జీవుడు ప్రాథమికంగా అస్వతంత్రుడు. భ యం ఆతడి గుణం, స్వభావం. కానీ విజ్ఞానమయ, ఆనందమయ కోశాల వల్లనే మానవుడు ఆనంద పిపాసి అవుతున్నాడు. పరమాత్మ భావనతో కూడిన మనిషి నిర్భీకుడౌతున్నాడు.
మనుష్యానందం, గంధ ర్వానందం, మానవ గంధర్వానందం, దేవ గంధర్వానందం, పితృ పితానందం, ప్రజా పితానందం, ఆపై బ్రహ్మానందం జ్ఞాని అ న్నివేళలా ఆనందస్థితిలోనే ఉంటాడు. ప్రతివ్యక్తీ బ్రహ్మానంద స్థితికై ప్రయత్నించాలి. మనసును, వాక్కును నియంత్రించుకున్న వ్యక్తి మాత్రమే ఆనందాన్ని అందుకోగలడు. అనుభవించగలడు. భౌతిక, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక సూత్రాలకు, ధర్మాలకు ప్రతి వ్యక్తీ జవాబుదారీతనాన్ని ఆపాదించుకుంటూ జీవించాలి. ఇదే ఆనందవల్లి! ఆపై భృగువల్లి! యుక్తాహారం, ఇంద్రియ నిగ్రహం, తపస్సును గురించి విచారణ చేస్తుంది. బ్రహ్మమును తెలుసుకోవాలంటే తపస్సు అనివార్యం!
దేనినుంచీ ప్రాణులు పుడుతున్నాయో, మరణానంతరం ప్రాణులు దేనిలో లయిస్తున్నాయో తెలుసుకోవటమే తపస్సు. ఆ ప్రయత్నం ఆగకుండా కొనసాగుతుండాలి. అన్నాన్ని బ్రహ్మంగా గ్రహించాలి. ప్రాణులన్నీ అన్నం నుంచీ పుట్టి, అన్నంలోనే లయిస్తున్నయ్. ఆ విధంగానే ప్రాణం బ్రహ్మమవుతున్నది. దీనిని తెలుసుకునే ప్రయత్నమూ తపస్సే. కనుక తపస్సు బ్రహ్మమేనంటున్నది భృగువల్లి!
ఆహారానికి నమస్కరిస్తూ, ప్రశాంత చి త్తంతో దానిని స్వీకరించాలి. అన్నాన్ని ధ్యా నించాలి. అన్నాన్ని నిరంతరం సృష్టిస్తూనే ఉండాలి. పంచభూతాలను సమన్వయం చేసేది అన్నమే! సంతానం, పశుసంపద వంటివన్నీ అన్నాన్ని ఆధారం చేసుకుని విస్తరిస్తుంటయ్. అన్నం ఎంత వితరణ చేస్తే తిరిగి అంతే లభిస్తుంది.
అన్నాన్ని బ్ర హ్మం గా భావించిన వ్యక్తికి, మెతుకు మెతుకులో బతుకును నడిపించే శక్తి వితరణ అవుతుం ది. ప్రాణ, అపానాలలో భద్రతగా, చేతుల లో క్రియాశక్తిగా, పాదాలలో చలనశక్తిగా, విద్యుత్తులో శక్తిగా, గ్రహతారకలలో కాంతి గా, వర్షంలో హాయిగా, ప్రాణాధార శక్తిగా... చేరి, ప్రాపంచిక మనసును, పరతత్త్వం వైపు సునాయాసంగా నడిపిస్తుంది. విశిష్టంగా, వరిష్ఠంగా ఆలోచించినట్లయితే మేధావి అవుతాడు. కోరికలకు దూరంగా ఉండగలిగిన వ్యక్తికి, అన్నీ ఆశించకుండానే అమరుతయ్.
వేదాలకు నమస్కరించి, వాటిని గౌరవించగలిగితే వేద విజ్ఞానం జగత్తును రక్షిస్తుంది. ఒక అతిథి, గృహస్థు ఇంట భోజనం చేస్తే, ఆ అన్నమే గృహస్థును బ్రహ్మజ్ఞానం వైపు నడిపిస్తుంది. ఏ వయసులో అన్నదానం చేస్తాడో ఆయా వయో స్థితులకు తగినట్లు ఫలితం లభిస్తుంది. అంటే బాల్యంలో, యౌవనంలో తేజస్సు, శీలశక్తి; వృద్ధాప్యంలో తృప్తిని, శాంతిని, హాయిని కలిగించి, అన్నదాన ఫలం తప్పక లభిస్తుంది. బ్రహ్మజ్ఞానం పట్ల కలిగే ఆసక్తి, అనురక్తిని మించిన లాభం వేరొకటి లేదు. మనిషికి కావలసిందీ అదే!