calender_icon.png 26 March, 2025 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇలయరాజా సంగీతం.. కీరవాణి సాహిత్యంలో గీతం

25-03-2025 11:37:14 PM

రూపేశ్, ఆకాంక్షా సింగ్ హీరోహీరోయిన్లుగా, రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘షష్టిపూర్తి’. మా ఆయి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమాకు పవన్‌ప్రభ దర్శకుడు. ‘కాంతార’ ఫేమ్ అచ్యుత్‌కుమార్, సంజయ్ స్వరూప్, తెనాలి శకుంతల, ఆనంద చక్రపాణి, రాజ్ తిరందాసు, మురళీధర్‌గౌడ్, ‘చలాకి’ చంటి, ‘బలగం’ సంజయ్, అనుపమ స్వాతి, రుహీనా, అనిల్, కేఏ పాల్ రాము, మహిరెడ్డి, శ్వేత, లత, ప్రవీణ్‌కుమార్, శ్రీధర్‌రెడ్డి, అంబరీష్ అప్పాజీ ఈ సినిమాలో వివిధ పాత్రలో పోషించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకుడు. ఆయన సంగీత సారథ్యంలో తొలిసారి ఎంఎం కీరవాణి పాట రాయడం విశేషం.

ఆస్కార్ అవార్డు విజేతగా నిలిచిన తర్వాత కీరవాణి రాసిన తొలి గీతమూ ఇదే. ఈ ఇద్దరు దిగ్గజ సంగీత దర్శకుల కలయికలో రూపొందింది ‘ఏదో ఏ జన్మలోదో’ పాట. ఈ గీతాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పవన్‌ప్రభ మాట్లాడుతూ.. ‘మేం ఇళయరాజా దగ్గరకు పాటల రికార్డింగ్ కోసం చెన్నై వెళ్లాం. రెండు పాటలకు బాణీలు అందించారు. సెకండ్ సాంగ్ రికార్డింగ్ టైమ్‌లో మూడో పాట కూడా తీసుకోవచ్చు కదా, మళ్లీ రావడం ఎందుకని రాజా చెప్పారు. సందర్భం చెప్పిన తర్వాత ఆయనొక బాణీ ఇచ్చారు. రెగ్యులర్ టైపు సాంగ్ కాదది. ఆ పాటలో కథ చెప్పాలి. ఆ అమ్మాయి జీవితంలో జరిగిన విషయాలు చెబుతున్నట్టు ఉండాలి.

అలాగే, ప్రేమిస్తున్న వ్యక్తికి ఆ అమ్మాయి తాను ఇలా ఉండబోతున్నానని చెప్పాలి. అప్పటికి రెహమాన్, చైతన్యప్రసాద్ పాటలు రాశారు. వాటిలో వాళ్ల స్టుటైల్ వినబడుతోంది. కొంచెం కొత్తగా వెళదామని అనుకున్నా. కీరవాణిలో చమత్కారమైన రైటర్ ఉంటారు. ఆయన రాస్తే అందరికీ అర్థమయ్యేలా, సాహిత్య విలువలతో, క్యాచీగా ఉంటుందని అనిపించింది. మెల్లగా నా మనసులో మాటను రూపేశ్‌కు చెప్పా. ఆ తర్వాత చైతన్యప్రసాద్ చెవిలో వేశా. ట్రై చేద్దామని ఆసక్తి చూపించారు. అప్పుడు ఆ తర్వాత మరో ఆలోచన లేకుండా కీరవాణిని సంప్రదించాం.

ఆయనకు చైతన్యప్రసాద్ ఫోన్ చేశారు. వేరే సినిమా రీ రికార్డింగ్ చేయడం కోసం ఆయన చెన్నైలో ఉన్నారు. వెంటనే కలిసి ‘షష్టిపూర్తి’లో పాట రాయమని అడిగాం. రాజాకు చెప్పారా? అని కీరవాణి అడిగారు. మీరు ఓకే అంటే చెబుదామని చెప్పా. బాణీ అడిగారు. పల్లవి రాసి పంపిస్తానని, నచ్చితే పాట రాస్తానన్నారు. కీరవాణి దగ్గర నుంచి రాజా స్టూడియో దగ్గరకు వెళ్లేసరికి పల్లవి వచ్చింది. చైతన్యప్రసాద్ చదివి వినిపించారు. నభూతో న భవిష్యత్. అంత అద్భుతంగా రాశారు. అనన్యా భట్ కూడా పాటను అద్భుతంగా పాడారు. రాజా బాణీలో కీరవాణి సాహిత్యం, అనన్యా భట్ గాత్రం కలిసి పాట అద్భుతంగా వచ్చింది” అని చెప్పారు.