calender_icon.png 19 November, 2024 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిష్కారం మన చేతుల్లోనే!

30-06-2024 12:00:00 AM

ఉద్యోగ, ఉపాధి కల్పన అనేది రాజకీయ నినాదంగా ఉండిపోతున్నది. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అందని ద్రాక్షగానే దాదాపుగా ఉంటున్నాయి. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లేకపోవడంతో రాజకీయ పార్టీలు కుల ప్రాతిపదికన రిజర్వేషన్ కోటాల కోసం ప్రజలమధ్య పోటీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఉన్న కొద్దిపాటి ఉద్యోగాల విషయంలో నిరుద్యోగ యువత తమలో తాము పోట్లాడుకునేలా చేస్తున్నారు. సమస్య మూలాన్ని తొలగిం చకుండా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదు.  ప్రైవేటు ఉద్యోగ, ఉపాధి కల్పన విషయం ప్రభుత్వాలు చొరవ చూపిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఎంప్లాయిమెంట్ అయితే జనరేట్ కావడం లేదు. దీనికి ప్రధాన కారణం నైపుణ్య లోపాలే. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతీ యువకులలో ఇండస్ట్రీకి సరిపోయే స్థాయిలో స్కిల్స్ (నైపుణ్యాలు) లేకపో వడం. దీనికి పభుత్వాలు తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది. 

నైపుణ్య శిక్షణ అవసరం

ఏపీలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ‘నైపుణ్య గణన’ చేపడుతున్నట్టు ప్రకటించింది. అది ఆహ్వానించదగిన విషయం. ఎందుకంటే యువతలో ఏ మేరకు, ఏయే విషయాల్లో స్కిల్స్ ఉన్నాయి? అనే విషయాలు తెలుసుకున్నట్టయితే వారికి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు? ఏ మేరకు వారిని ట్రెయిన్ చేయొచ్చు? అనేది తేలుతుంది. ఫలితంగా ఉపాధి కల్పనకు కొంతమేరకైనా అడుగులు పడతాయి. విద్యార్థుల ఎగుమతి, నిరుద్యోగుల దిగుమతి చేయగల చదువుల రేవులు యూనివర్సిటీలు’ అని ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ ఏనాడో చెప్పారు. అది అక్షర సత్యంగా నిరూపితమవుతూనే ఉంది. దేశంలో నిరుద్యోగ సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. దేశానికి అడ్వాంటేజ్ కావలసిన డెమొగ్రఫిక్ డివిడెండ్ డిస్‌అడ్వాంటేజ్‌గా మారుతోంది. ప్రతి ఒక్కరూ తమకు మంచి వేతనంతో కూడిన సురక్షితమైన ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు. కానీ, అందుకు తమ వద్ద కావలసిన నైపుణ్యం ఉందా? అనే ప్రశ్నను తమకు తాము వేసుకోలేకపోతున్నారు. పైగా చక్కటి శాలరీతో కూడిన ఉద్యోగాలు లేవని అంటున్నారు. 

భారతీయ జనాభాలో మూడింట రెండొంతుల మంది పని చేసే వయస్సులో ఉన్నారు. కానీ, వారికి వేతనంతో కూడిన పని దొరకక వారి శక్తి పూర్తిగా వృథా అవుతోందని ఓ సర్వేలో తేలింది. ఫలితంగా వారు ఆర్థిక వ్యవస్థలో భాగం కాలేకపోతున్నారు. ఏటా దాదాపు 50 లక్షలమంది యువత శ్రామికశక్తిలో చేరుతున్నారు. కానీ, వారిలో చాలామందికి వేతనంతో కూడిన పని దొరకడం లేదు. తాజా సర్వే ప్రకారం దేశంలో 15- 29 ఏండ్ల మధ్యగల ప్రతి ఆరుగురిలో ఒకరు నిరుద్యోగులుగా ఉన్నారు. నిరుద్యోగులందరిలో సెకండరీ పాఠశాల పూర్తి చేసిన యువత నిష్పత్తి 2000లో 54% ఉండగా, అది 2022 నాటికి 66%కి పెరిగింది. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం క్లరికల్ ఉద్యోగాల్లో కొన్ని వందల ఖాళీలను భర్తీ చేయాలని యోచిస్తున్నట్టు ప్రకటించగానే వేలాది మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, పీహెచ్డీ చేసినవాళ్లు కూడా అప్లయ్ చేసుకుంటున్నారు. మరోవైపు లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూనే వృథాగా ఏండ్లు గడుపుతున్నారు. 

అభిరుచి మేరకు ముందడుగు

ఈ నేపథ్యంలోనే ఏటా ఉద్యోగాల సృష్టి కంటే తగ్గుతున్నవే ఎక్కువ. ఈ ఏడాది ఐఐటీ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు కూడా ఉద్యోగం కోసం కష్టపడుతున్నారు. అందుబాటులో ఉన్న ఉద్యోగాల పరిమాణం నిలిచిపోవడమే కాకుండా, ఉద్యోగాల నాణ్యత క్షీణిస్తోంది. మెజార్టీ కంపెనీలలో, సాధారణ శాశ్వత ఉద్యోగాల కంటే తాత్కాలిక ఒప్పంద ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఎక్కువమంది కార్మికులు ఎటువంటి సామాజిక భద్రత లేకుండా ఎక్కువ గంటలు కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేయవలసి వస్తోంది. రాష్ట్రాల స్థాయి లో 20 లక్షలు ఉద్యోగాలు, కేంద్ర స్థాయి లో 2 కోట్ల ఉద్యోగాల కల్పన అనేది వట్టి ప్రచారమే అని ఇప్పటికే తేలిపోయింది. 

ఈ నేపథ్యంలో సమస్య మూలాన్ని తొలగించకుండా నిరుద్యోగ సమస్యను పరిష్కరించ డం ఏ ప్రభుత్వానికైనా సాధ్యం కాదు. కాబట్టి సమస్యను లోతుల్లోకి వెళ్లి అధ్యయనం చేయాలి. ఈ క్రమంలోనే యువతీ యువకులు సైతం తమ ఆసక్తి(అభిరుచి), నైపుణ్యం ఏంటో గుర్తించాలి. ఇందుకు తల్లిదండ్రులు, గురువుల సహకారం తీసుకోవాలి. ఏ విషయంలో తమకు ఆసక్తి ఉందో తెలుసుకుని దానిలో నైపుణ్యం పెంచుకున్నట్లయితే తప్పకుండా ఆ రంగంలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. ఉదా॥కు చిన్ననాటి నుంచి వస్తువుల రిపేర్లపట్ల ఆసక్తి ఉన్న పిల్లవాడికి టెక్నికల్ ఎడ్యుకేషన్ గురించి తెలిపి, ఆ దిశగా ప్రోత్సహిస్తే తప్పకుండా టెక్నికల్ స్కిల్స్ సంపాదించి వర్క్ ఫోర్స్‌గా మారే అవకాశాలు ఉంటాయి. ఈ మేరకు నిరుద్యోగ సమస్య తీరే అవకాశం ఉంటుంది.

 అంబీర్ శ్రీకాంత్