ఓయూలో క్రిమినల్ చట్టాలపై రూపొందించిన బుక్‌లెట్‌ను ఆవిష్కరిస్తున్న అతిథులు
లా విద్యార్థులకు హైకోర్టు జస్టిస్ నగేశ్ సూచన
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (విజయక్రాంతి) : న్యాయ విద్యార్థులు ఆకాశమే హద్దుగా ఉన్నతస్థాయికి ఎదగాలని తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ నగేశ్ భీమపాక అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో.. ఓయూ లా కాలేజీ, అనంత లా కాలేజీ, విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా ఆధ్వర్యంలో నిర్వహించనున్న రెండు రోజుల సెమినార్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్టారెడ్డితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు
. కష్టపడి చదవడంతో పాటు సరైన ప్రాక్టీస్ చేస్తే లా విద్యార్థులు భవిష్యత్‌లో రాణించగలరని అన్నారు. ఈ సందర్భంగా కొత్త క్రిమినల్ చట్టాలపై రూపొందించిన బుక్‌లెట్‌ను అతిథులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఓయూ డీన్ ప్రొ. బి.విజయలక్ష్మి, ప్రొ.ఎన్.రామప్రసాద్, ఓయూ లా కాలేజీ ప్రిన్సిపాల్ డా.వి.రాధికయాదవ్, సెమినార్ కన్వీనర్ చంద్రమతి, కరెస్పాండెంట్ రవి అనంత, లా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.