calender_icon.png 20 September, 2024 | 3:03 AM

ఆకాశమే హద్దుగా.. తొలి ఫైటర్ పైలట్‌గా!

19-09-2024 12:00:00 AM

యుద్ధం ఎదుర్కోవాలంటే ఎన్నో ధైర్య సాహసాలు కావాలి. అంతకుమించి గొప్ప వ్యూహం ఉండాలి. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయాలి. ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ ఉండాలి. అయితే యుద్ధ విమానాలు నడపాలంటే మగవాళ్లకే కష్టసాధ్యమైన పని. కానీ అలాంటి యుద్ధ రంగంలో సైతం మహిళలు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో మోహనా సింగ్ తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా సరికొత్త చరిత్ర సృష్టించారు. 

యుద్ధ విమానం నడిపే సమయంలో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమయస్ఫూర్తి, సామర్థ్యం, నేర్పు ఉండాలి. అవసరాన్ని బట్టి ఆకాశం నుంచి ఆకాశంలోకి, ఆకాశం నుంచి భూమిపైకి విమాన మార్గాన్నిమళ్లించే చతురత కలిగి ఉండాలి. ఇన్నీ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే మోహనా సింగ్‌కు అరుదైన అవకాశం దక్కింది. స్వదేశీ యుద్ధ విమానం (ఎల్‌సీఏ) తేజస్ ఫైటర్ జెట్‌ను నడపడానికి అనుమతి పొందిన దేశంలో తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా స్క్వాడ్రన్ లీడర్ గా గుర్తింపు పొందారు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఫైటర్ స్క్వాడ్రన్ లో చేరిన తొలి మహిళా ఫైటర్ పైలట్ స్థాయికి చేరింది. 

ఇటీవల జోధ్‌పూర్‌లో జరిగిన ’తరంగ్ శక్తి’ విన్యాసాల్లో పాల్గొన్న మోహనా సాయుధ దళాలకు చెందిన ముగ్గురు వైస్ చీఫ్ లతో కలిసి చారిత్రాత్మక విమానంలో పాల్గొన్నారు. ‘తరంగ్ శకి’్త అనేది బహుళ దశల సైనిక విన్యాసం. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, యుకే లాంటి దేశాలు పాల్గొన్నాయి. తరంగ్ శక్తిలో మోహనా సింగ్ పెద్ద పెద్ద యుద్ధ విమానాలను నడిపి సమర్థత చాటుకున్నారు. అయితే ప్రపంచంలో నాలుగో అతిపెద్ద వైమానిక దళమైన భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో ప్రస్తుతం 20 మంది మహిళా ఫైటర్ పైలట్లు ఉన్నారు. 2016 నుంచి భారత సైనిక రంగంలో మహిళలు రాణిస్తూ వస్తున్నారు. ఈ అవకాశం అన్ని సరిహద్దులను చెరిపేలా చేసింది. అప్పట్నుంచే మగవాళ్లతో సమానంగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో మోహనా సింగ్ తొలి మహిళా ఫైటర్ పైలట్ గా నిలిచారు. 

మోహనా సింగ్‌ది రాజస్తాన్. అమృత్‌సర్‌లో గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ గ్రాడ్యుయేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో బీటెక్ చేశారు. 2013లో 83.7 శాతం మార్కులతో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇక మోహనా తండ్రి వాయుసేనలోనే వారంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. తాత రామ్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ లో ఫ్లైట్ గన్నర్. ఈయన 1948 భారత్-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. వీర్ చక్ర అవార్డు కూడా పొందారు.

కాగా తండ్రి ప్రతాప్ సింగ్ విధులు నిర్వర్తిస్తున్న చోటే మోహనా ట్రెయినీ క్యాడెట్‌గా చేరడం విశేషం. ఇక మోహనా సింగ్‌తోపాటు భావనా కాంత్, అవనీ చతుర్వేది కూడా యుద్ధ విమానాలు నడిపేందుకు అర్హత సాధించేందుకు శిక్షణ పొందారు. వీరంతా ఎస్‌యూ-30ఎంకే, ఎల్ సీఏ తేజస్ విమానాలను నడుపుతున్నారు. తొలినాళ్లలో ముగ్గురు పైలట్లు వైమానిక దళం ఫైటర్ ఫ్లీట్ నుంచి వివిధ విమానాలను నడిపారు. కానీ వారిలో మోహనా సింగ్ మాత్రమే మహిళా ఫైటర్ పైలట్ కాగలిగింది.