బొమ్మల కొలువు.. సంక్రాంతి పండుక్కి పెట్టే ఆచారం ఎక్కువ. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కొందరు దసరాకే బొమ్మల కొలువు పెడతారు. అయితే అసలు బొమ్మల కొలువు అంటే ఏమిటి? ఎందుకు పెడతారు? ఎలా పెడతారు? తెలుసుకుందాం.
బొమ్మలన్నింటినీ చేర్చి, తయారుచేసి ప్రతి ఏడాది కొత్తకొత్త సంఘటనలు, పురాణ గాధలు, చారిత్రక ఘట్టాలు, శ్రీకృష్ణలీలు, దశావతారాలు, కురుక్షేత్ర యుధ్ధ ఘట్టాలు, కొలువుగా తీర్చిదిద్దడం ఓకళ. మెట్లు మెట్లుగా ఏర్పరచి అన్నిబొమ్మలు సరిగా కనిపించేలా అమర్చుతారు. ఇది ఒక అద్భుతమైన కళ. సర్వసాధారణంగా పిల్లల ఆనందం, ఉత్సాహాల కోసం ఏర్పరిచేదే ఈ దసరా బొమ్మల కొలువు . ఈ దసరా పండుగ సందర్భంగా 9 రాత్రులు ఈ బొమ్మల కొలువు పండగ జరుపుతారు.
దుర్గాదేవి రాక్షస సమ్హారం గావించినందుకుగుర్తుగా అలంకరణకు తొమ్మిది మెట్లుఏర్పరుస్తారు. లేదా ఏడు, ఐదు, మూడు మెట్లు కూడా అమర్చడం సహజం. మహిళల కళాదృష్టి, ఆర్ధిక స్తోమత, సౌకర్యాలను బట్టి ఈ మెట్లపై రకరకాల బొమ్మలను కూరుస్తారు. మెట్లపై దేవుళ్ళ బొమ్మలను ఉంచుతారు. అమ్మవారి బొమ్మలు కూడా ఉంచే ఈచోటుని సత్వగుణానికి ప్రతీకగా నిర్వచిస్తారు.
కింద ఉన్న మెట్లపై ప్రాపంచిక జీవితానికి సంబందించిన బొమ్మలు ఉంచుతారు. అవి తామస గుణాన్ని ప్రతిబింబిస్తాయని నమ్మకం. మధ్య భాగంలో క్షత్రియధర్మాన్ని తెలుపుతూ ఉండే రాజు, రాణి, యుద్ధ వీరుల వంటి బొమ్మల పెడతారు. ఇక అన్నిటికన్నా పైమెట్టు మీదఉంచే కలశం దేవీ కరుణకు సూచన. ఈ మూడు సత్వ రజస్తమో గుణాలను అధిగమించిన వారికి దేవీ కటాక్షం అందుతుందని విశ్వాసం.
ఫ్రతిరోజూ ధూప, దీప నైవేద్యాలతో లలితా సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరం చదివి, పూజలు చేస్తారు. ప్రతి రోజు సాయంత్రం మహిళలను పిలిచి పసుపు - కుంకుమ, తాంబూలం, దక్షిణ ఇస్తే తమకు అష్టైశ్వర్యాలు కలసివస్తాయని, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. ఆ సమయంలో మగువలంతా ఇచ్చిపుచ్చుకొనే కుంకుమ ఇల్లాలి సౌభాగ్యానికి చిహ్నం.
అష్టగంధం, పసుపు ఆరోగ్యానికి చిహ్నాలు. అయితే మహిషాసురుణ్ణి చంపేందుకు దేవి కొంతకాలము సూది మొన మీద తపస్సు చేసిందంటారు. అందుకని బొమ్మల కొలువున్నన్ని రోజులు సూదిలో దారం పెట్టికుట్టరు. ఈ బొమ్మల కొలువు ప్రతి సంవత్సరం ఒక్కో విధంగా ఏర్పరుస్తారు.
ఈ బొమ్మల పండుగను ఎక్కువగా కర్నాటకలో ఘనంగా జరుపుకుంటారు. పురాణాలను పరిచయం చేస్తుంది. దసరా పండుగ సందర్భంగా దైవిక ఆశీర్వాదం పొందడం, పిల్లలను అలరించడం కూడా ఒక మార్గం. అయితే సాంప్రదాయ బొమ్మల తయారీ రోజురోజుకు తగ్గుతూ వస్తోంది.
మెుదటి మెట్టు: గడ్డి, చెట్లు మెుదలగు బొమ్మలు.
రెండవ మెట్టు: నత్త, శంఖు వంటి బొమ్మలు.
మూడవ మెట్టు: చీమల బొమ్మలు.
నాలుగవ మెట్టు: ఎండ్రకాయ వంటి బొమ్మలు.
ఐదవ మెట్టు: జంతువులు, పక్షులు బొమ్మలు.
ఆరవ మెట్టు: మనిషి బొమ్మలు.
ఏడవ మెట్టు: రుషుల బొమ్మలు.
ఎనిమిదవ మెట్టు: దేవతల అవతారాలు, నవగ్రహ అధిపతులు, పంచభూత దేవతలు, అష్టదిక్పాలకుల బొమ్మలు పెట్టాలి.
తొమ్మిదవ మెట్టు: బ్రహ్మ, విష్ణు, శివ, త్రిమూర్తులు
వారి అర్ధాంగియైన సరస్వతి, లక్ష్మి, పార్వతి బొమ్మలు అమర్చడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.